Ramappa | శివ శివా…ఇవేం పనులు…!?

Ramappa | శివ శివా…ఇవేం పనులు…!?

– ప్రమాదకర స్థలంలో రామప్ప హరిత హోటల్ నిర్మాణం 

 – పైన హై టెన్షన్ వైర్లు.. కింద దేవాదుల పైపులైన్లు…

– ప్రమాదం జరిగితే బాధ్యులెవరు..?

– ప్రశ్నాపత్రం లీకేజీ తో ఉద్యోగం పొందిన అధికారులు అయితేనే ఇలా చేస్తారంటున్న స్థానికులు..

– యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప లో అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేని ప్రభుత్వాలు…

తెలంగాణ జ్యోతి, నవంబర్ 18, ములుగు ప్రతినిధి : యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప రామలింగేశ్వర స్వామి దేవాలయం వద్ద చేపడుతున్న హరిత హోటల్ నిర్మాణ పనులను చూసి శివ శివా ఇవేం పనులు అంటూ పర్యాటకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం పరిసరాల్లో అంతర్జాతీయ స్థాయిలో ఉండాల్సిన హరిత హోటల్ ను త్రిశంకు స్వర్గంలో నిర్మిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రామప్ప దేవాలయం అభివృద్ధి పట్ల ప్రజా ప్రతినిధులు,అధికారులు చిత్తశుద్ధి లేని పనులు చేస్తుండడం పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 800 ఏళ్ల క్రితం ఈ ప్రాంతాన్ని పరిపాలించిన కాకతీయ రాజుల కాలంలో నిర్మించిన రామప్ప దేవాలయానికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చిన నేపథ్యంలో ఇక్కడ కల్పించాల్సిన సౌకర్యాలపై చుట్టపు చూపుగా వచ్చి డప్పు కొట్టుకునే కొందరు ప్రజాప్రతినిధులు, అధికారుల తీరుపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలో ఉన్న రామప్ప దేవాలయం పరిసరాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులపై ప్రత్యేక కథనం…

– హై టెన్షన్ వైర్లు.. దేవాదుల పైపులైన్లు …

రామప్ప దేవాలయానికి వెళ్లే తూర్పుముఖద్వారం ప్రాంతంలో నిర్మిస్తున్న హరిత హోటల్ పైన హై టెన్షన్ వైర్లు ప్రమాదకరంగా ఉన్నాయి. భవిష్యత్తులో హోటల్ గదులను పెంచితే సమస్య తీవ్రమయ్యే అవకాశాలున్నాయి. క్రింద దేవాదుల పథకంలో గోదావరి జలాలను ఎత్తిపోతల ద్వారా రామప్ప సరస్సు తోపాటు ఇతర ప్రాంతాలకు పంపించే పైపులైన్లు ఉన్నాయి. ఇప్పటికే చాలా చోట్ల పైపులైన్ లీకేజీలు జరిగిన సంఘటనలు ఉన్నాయి. హరిత హోటల్ నిర్మాణం చేస్తున్న ప్రాంతంలో భారీ నిర్మాణాల కోసం చేపట్టే పనుల వల్ల పైపులైన్లకు ప్రమాదం పొంచి ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలోనూ రామప్ప సరస్సు కట్ట ప్రాంతంలో అవసరం లేని చోట మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టి లక్షల రూపాయలను వృధా చేశారు. వాటిని ఇప్పటివరకు కూడా వినియోగించకపోవడం చూస్తుంటే అదే పరిస్థితి హరిత హోటళ్లకు కూడా వస్తుందని భావిస్తున్నారు. అధికారులు ముందు చూపులేని తనంతో ఇష్టారాజ్యంగా తమకు నచ్చిన చోట నిర్మాణాలు చేస్తూ పర్యాటకుల ప్రాణాలకు ముప్పు తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.

– ప్రమాదం జరిగితే బాధ్యులెవరు ..?

హరిత హోటల్ నిర్మాణo అనంతరం పైపులైన్లు, హైటెన్షన్ వైర్లతో ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రశ్నాపత్రాల లీకేజీ తో చాలామంది ఉద్యోగాలు పొందిన ఘటనలు ఉన్నాయని అలాంటి ఉద్యోగులే ముందు చూపు లేకుండా ఇలాంటి నిర్మాణాలను చేపడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులు రామప్ప దేవాలయానికి వచ్చే సందర్భంలో హరిత హోటల్ లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాల్సి ఉంది .ప్రమాదకరమైన ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టి పర్యాటకుల ప్రాణాలతో చెలగాటం ఆడడంలో ఆంతర్యం ఏమిటో అధికారులకే తెలియాలి.

– చిత్తశుద్ధి లేని ప్రభుత్వాలు..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు తేవడంలో ముందున్నామని చెప్పుకోవడంతోనే సరిపోయింది. ఇప్పటికే రామప్ప చుట్టూ బఫర్ జోన్ గా ప్రకటించిన ప్రాంతంలో అభివృద్ధి పనులు పూర్తికాలేదు. కామేశ్వరాలయం పునర్నిర్మాణం చేపట్టడంతో పాటు చుట్టూ ఉన్న చిన్న ఆలయాలను పూర్తిగా అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఆ దిశగా పనులు మాత్రం జరగడం లేదు. యునెస్కో గుర్తింపు తర్వాత రామప్ప దేవాలయం అభివృద్ధిలో కొంత భాగం కేంద్ర ప్రభుత్వం మిగతా చోట్ల రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంటుంది. ఆ దిశగా హామీలు ఇవ్వడం తప్ప ఇప్పటివరకు చేసింది ఏమీ లేదు. దీంతో రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు కూడా రద్దయ్యే ప్రమాదం ఉందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. వెంకటాపూర్ లో ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల తవ్వకాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ లబ్ధి పొందే ప్రయత్నాల్లో భాగంగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని పట్టించుకోవడంలేదని, అందులో భాగంగానే హరిత హోటల్ నిర్మాణం పనులు కూడా ప్రమాదకరమైన స్థలాల్లో చేపట్టి గుర్తింపు రద్దుకు ప్రజాప్రతినిధులు, అధికారులే బాటలు వేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment