వెంకటాపురంలో రభీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
రైతులకు మద్దతు ధరతో పాటు బోనస్ హామీ
వెంకటాపురం నూగూరు, ఏప్రిల్ 8, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో బుధవారం రభీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయనున్నారు. ఏ గ్రేడు వరి క్వింటాలకు రూ.2,389, బి గ్రేడ్ వరి క్వింటాలకు రూ.2,369 చొప్పున ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు కొనుగోలు చేస్తారని తెలిపారు. అదేవిధంగా సన్న రకం ధాన్యం విక్రయించే రైతులకు క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ కూడా అందజేస్తామని వెంకటాపురం పిఎసిఎస్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి ఆర్‌వివి సత్యనారాయణ పేర్కొన్నారు. రైతులు మధ్య దళారులకు తక్కువ ధరలకు అమ్మకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించి మద్దతు ధర పొందాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కొనుగోలు కేంద్రం ఇంచార్జి డి.వి. సుధారాణి, రైతులు, సిబ్బంది పాల్గొన్నారు.









