ట్రాఫిక్ సమస్యలు రాకుండా రహదారి కోసం ప్రణాళికలు
– 2028 మహాజాతర కోసం ఇప్పటినుంచే పకడ్బందీ ప్రణాళికలు
– సిఎంఓ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీనివాస రాజు
– మేడారం జాతర వీవీఐపీ రహదారి పరిశీలన
ములుగు, ఫిబ్రవరి5,తెలంగాణ జ్యోతి : మేడారం మహాజాతరకు తరలి వచ్చే వాహనాలు జాం కాకుండా ప్రత్యేక రవాణా వ్యవస్థను పునరు ద్ధరిస్తామని, అందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీ కేఎస్.శ్రీనివాస రాజు అన్నారు. గురువారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతరకు వీవీఐపీ వాహనాలు వచ్చే రహదారి, వాహనాల పార్కింగ్ స్థలం, మేడారం తాత్కాలిక ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్లతో కలిసి రూట్ మ్యాప్ లను పరిశీలించి పలు సూచనలు చేశారు. అధికారులతో మాట్లాడి జాతర సమయంలో వీవీఐపీ వాహనాల రాకపోకల్లో తలెత్తే సమస్యలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలను అడిగి తెలుసుకున్నారు. 2026 మహాజాతర అనుభవాలను దృష్టిలో ఉంచుకుని 2028 జాతరలో ఈ సమస్యలు పునరావృతం కాకుండా ముందస్తుగా సమగ్ర ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించారు. వచ్చే జాతరలో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ఇప్పటినుంచే ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తుందని సీఎంవో ముఖ్య కార్యదర్శి తెలిపారు. జాతరను విజయవంతం చేయడంలో కృషి చేసిన అధికారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ, ఆర్టీసీ, పంచాయతీ రాజ్ తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు.






