అబ్బాయిగూడెంలోనే పిసా గ్రామసభ నిర్వహించాలి
– ఎంపీడీవోకి వినతి పత్రం అందజేసిన గ్రామస్తులు
వెంకటాపురం, నూగూరు, జూన్ 25, తెలంగాణ జ్యోతి :
ములుగు జిల్లా వెంకటాపురం మండలం ముర్రవాని గూడెం పంచాయతీకి చెందిన అబ్బాయి గూడెం గ్రామంలో పిసా గ్రామ సభను, పేసా చట్టం ప్రకారం తమ గ్రామంలోనే నిర్వహించాలని కోరుతూ గ్రామస్తులు బుధవారం ఎంపీడీవో రాజేంద్రప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. గతంలో నిర్వహించిన గ్రామసభలో ఇతర గ్రామాల వారు పాల్గొనడం వల్ల వివాదాలు చోటు చేసుకున్నాయని వారు పేర్కొన్నారు. ఈసారి కూడా అబ్బాయి గూడెం గ్రామస్థుల అభ్యర్థన మేరకు గ్రామ సభను అక్కడే నిర్వహించేందుకు ప్రయత్నించినప్పటికీ, ఇతర గ్రామ సొసైటీ సభ్యుల ప్రతిస్పందనతో సభ వాయిదా వేయాల్సి వచ్చిందని తెలిపారు. ఈ నేపథ్యంలో పేసా చట్టం ప్రకారం గ్రామసభను కేవలం అబ్బాయి గూడెం గ్రామ ప్రజలతోనే నిర్వహించాలని, ఇతర గ్రామాల వారు లేదా ఇతర సొసైటీ సభ్యులు పాల్గొన కుండా చర్యలు తీసుకోవాలని అధికారులు కోరారు. పేసా చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి, అబ్బాయి గూడెం గ్రామస్తులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.