నూగూరులో మద్యం షాపుకు పీసా గ్రామసభ ఆమోదం
– మండలంలోని నాలుగు గ్రామాల్లో మద్యం షాపుల ఏర్పాటుకు అనుమతి
వెంకటాపురం, జూలై 30,తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం నూగూరు గ్రామంలో మద్యం షాపు ఏర్పాటు కోసం బుధవారం నిర్వహించిన పీసా గ్రామసభలో ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. ఈ గ్రామసభకు మండల అభివృద్ధి అధికారి రాజేంద్ర ప్రసాద్, గ్రామపంచాయతీ కార్యదర్శి వేణు, పీసా ఉపాధ్యక్షుడు మండెల వెంకటేశ్, మొబలైజర్ మనుబోతుల సురేష్, మాజీ సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, గిరిజన ఓటర్లు తదితరులు హాజరయ్యారు. “మద్యం షాపు కావాలా వద్దా?” అనే ఏక వాక్య తీర్మానాన్ని సమావేశంలో ప్రవేశపెట్టగా, గిరిజన ఓటర్లు చేతులెత్తి మద్దతు తెలపడంతో మద్యం షాపు ఏర్పాటుకు గ్రామసభ నుంచి అనుమతి లభించింది. ఇప్పటివరకు మండలంలోని వి.ఆర్.కే పురం, బీసీ మరిగూడెం, వెంకటాపురం గ్రామసభల్లో కూడా మద్యం షాపులకు అనుమతి లభించగా, ఇప్పుడు నూగూరు గ్రామం కూడా జోడవడంతో మొత్తం నాలుగు గ్రామాల్లో మద్యం షాపులు ఏర్పాటుకి పీసా గ్రామసభల ఆమోదం లభించినట్లయింది.