పంచాయతీ కార్యదర్శుల రెగ్యులరైజేషన్‌కు వినతి
ఆదివాసీ సమస్యలపై కలెక్టర్‌కు ఫిర్యాదు
వెంకటాపురం నూగూరు, ఏప్రిల్ 6 తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లాలో నాలుగు ఏళ్లుగా నిబంధనలకు లోబడి విధులు నిర్వహిస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులను తక్షణమే రెగ్యులర్ చేయాలని ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు కొర్స నర్సింహా మూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సోమవారం ఏటూరునాగారంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్‌కు వినతిపత్రం అందజేశారు. జిల్లాలో పని చేస్తున్న 30 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ప్రోహిబిషన్ పీరియడ్ పూర్తి చేసుకుని ఆరు నెలలు గడిచినా రెగ్యులర్ చేయకపోవడంతో తమ సర్వీసులు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోందని ఆయన తెలిపారు. గ్రామ స్థాయిలో ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేసే కీలక బాధ్యత నిర్వహిస్తున్న కార్యదర్శులను ప్రభుత్వం చిన్నచూపు చూడకూడదని, వెంటనే రెగ్యులరైజేషన్ చేయాలని కోరారు. ఇదే సందర్భంగా గిరిజన ప్రాంతాల్లో తీవ్రమైన త్రాగునీటి సమస్యలు ఉన్నాయని, కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ చెలిమల నీటిని త్రాగాల్సిన పరిస్థితి ఉందని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఏజెన్సీ ప్రాంతాల్లో త్రాగునీటి ఎద్దడి లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. నాలుగు దశాబ్దాలుగా సాగులో ఉన్న ఆదివాసీల భూములకు అసైన్మెంట్ పట్టాలు ఇవ్వాలని, పట్టాలు లేకపోవడంతో రైతులు దళారుల వద్ద అధిక వడ్డీకి అప్పులు తీసుకుని ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వ మద్దతు ధర కూడా దళారుల చేతుల్లోకి వెళ్లిపోతున్నదని, రైతు బంధు, రైతు భీమా వంటి పథకాలు అర్హులకు అందేలా చూడాలని సూచించారు. అసైన్మెంట్ కమిటీ ఏర్పాటు చేసి అర్హులైన ఆదివాసీ రైతులకు పట్టాలు మంజూరు చేయాలని కలెక్టర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కుంజ మహేష్, రైతులు బొగ్గుల రాఘవయ్య, ఎట్టి లక్ష్మయ్య, బొగ్గుల సూరిబాబు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.









