గోదావరి వరదల పట్ల ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలి
- కలెక్టర్ దివాకర టి.ఎస్.
ఏటూరునాగారం జూలై 24, తెలంగాణ జ్యోతి : గోదావరి నది ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. సూచించారు. గురువారం ఏటూరు నాగారం మండలం లోని దొడ్ల, కొండాయి బ్రిడ్జి వద్ద గోదావరి వరద పరిస్థితిని పరిశీలించిన కలెక్టర్, గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరి వరద ఉధృతి పెరిగిందని, కొండాయిలో తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయిందని తెలిపారు. అక్కడి ప్రజలకు నిత్యవసర సరుకులు, వైద్య సేవలు అందుబాటులో ఉంచినట్టు, బోటు సేవలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అదనంగా రెండు బోట్లు, ఎన్డీఆర్ఎఫ్ బృందం, నాలుగు బోట్లతో సహాయ చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు నెలపాటు సరిపడే నిత్యవసర వస్తువులు సిద్ధం చేశామని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేశామని వివరించారు. అగ్నిమాపక సిబ్బంది, అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, వర్షాకాల ఎమర్జెన్సీ బృందాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్న నేపథ్యంలో, పొంగిపొర్లే వాగులు, రహదారుల్లో రవాణా జరగకుండా భారీ కేడింగ్, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తహసీల్దార్, ఎంపీడీఓ, గ్రామ కార్యదర్శులను సంప్రదించాలని తెలిపారు. వెంటనే స్పందించేందుకు కలెక్టరేట్లో టోల్ ఫ్రీ నెంబర్ 18004257109 ద్వారా 24 గంటలు అధికారులు షిఫ్టుల వారీగా అందుబాటులో ఉంటారని, ముంపు ప్రాంతాల సమస్య లకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు. అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్ర మంలో డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ నాగరాజు, తహసీల్దార్ జగదీష్ తదితర అధికారులు పాల్గొన్నారు.
రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండాలి: కలెక్టర్ దివాకర
ఖరీఫ్ సీజన్లో రైతులు సాగు చేసేందుకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందు బాటులో ఉండేలా చూడాలని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అధికారులను ఆదేశించారు. గురువారం ఏటూరు నాగారం మండలం చిన్నబోయిన గ్రామంలోని పిఎసిఎస్ ఎరువుల విక్రయ కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి, నిల్వలు, రికార్డులు, లైసెన్స్‌లు పరిశీలించారు. ఈ-పాస్ మిషన్ వినియోగంపై వివరాలు తెలుసుకున్నారు. రిజిస్టర్ సక్రమంగా నిర్వహించాల్సిందిగా సూచిస్తూ,నిల్వల వివరాలను వ్యవసాయ శాఖ అధికారులకు ప్రతిరోజూ అందించాలన్నారు. విత్తనాలను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిం చారు. జిల్లాలో సరిపడా విత్తనాలు, ఎరువులు, మందులు స్టాక్‌లో ఉన్నాయని తెలిపారు. రైతులు ఆందోళన చెందవద్ద న్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వేణుగోపాల్, పిఎసిఎస్ సీఈఓ గౌరి, ఏఈఓ రాజు, ఇతర సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.