పెండింగ్ దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి
– కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి, జూలై7, తెలంగాణ జ్యోతి : జిల్లా కేంద్రంలోని ఐడిఓసి కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న అన్ని దరఖాస్తులను వచ్చే సోమవారం లోపు పరిష్కరించి, సంబంధిత నివేదికలను సమర్పించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో మొత్తం 63 దరఖాస్తులు అందాయని తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన సమస్యలను పెండింగ్‌లో ఉంచడం వల్ల కార్యక్రమ లక్ష్యం నెరవేరదని, ప్రతి ఒక్క సమస్యను వేగంగా పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రజాభవన్ హైదరాబాద్ నుండి వచ్చిన దరఖాస్తులు కూడా సమయ పాలనతో పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.