విద్యతోపాటు క్రీడల్లో రాణించాలి
– క్రీడల్లో గెలుపు ఓటమిలు సహజం.
– జిల్లాకు స్పోర్ట్స్ స్కూల్ మంజూరు.
– మంత్రి దనసరి సీతక్క.
– స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ శివసేన రెడ్డి
ములుగు ప్రతినిధి, జూన్19, తెలంగాణ జ్యోతి : క్రీడల్లో గెలుపు ఓటమి సహజమని, గెలుపొందిన క్రీడాకారులు ఉప్పొంగి పోకుండా క్రీడ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని ఓటమి చెందిన క్రీడాకారులు కృంగిపోకుండా గెలుపు కోసం ప్రయత్నించాలని రాష్ట్ర పంచాయితి రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. గురువారం జిల్లా కేంద్రం లోని టాస్క్ సెంటర్ లో తాడ్వాయి, రంగాపూర్, ఏటూరు నాగారం, మంగపేట, లక్ష్మీపురం, జవహర్ నగర్, చిన్న గుంటూరు పల్లి, బండారుపల్లి జట్ల క్రీడాకారులకు రాష్ట్ర పంచాయితి రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ శివసేన రెడ్డి, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., గ్రంధాలయ సంస్థ చైర్మన్ రవి చందర్ లతో కలసి క్రికెట్ కిట్లను, హ్యాండ్ బాల్ స్టేట్ లెవెల్ మెడల్స్ విన్నెర్స్ రాధిక ఇమ్రాన్ వాసు, రెజ్లింగ్ క్రీడాకారులకు సమ్మర్ కోచింగ్ సర్టిఫికెట్స్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలోని విద్యార్థిని విద్యార్థులు తమలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలుగులోకి తేవాలని, ప్రతి వేసవి కాలంలో క్రీడలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నదని అన్నారు. ప్రతి విద్యార్థికి క్రీడలు ఎదగడానికి తోడుపడతాయని, క్రీడల్లో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులు ఆరోగ్య కరంగా ఉంటారని తెలిపారు. ప్రతి విద్యార్థి ప్రతిరోజు నడక, పరుగు వ్యాయామం చేయాలని, ఎండకు ఎండి వానకు తడిసిన వారే ఆరోగ్యకరంగా ఉంటారని తెలిపారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ శివసేన రెడ్డి తెలంగాణ గ్రామీణ క్రీడా రంగాన్ని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ పనిచేస్తుందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ములుగు జిల్లాకు స్పోర్ట్స్ స్కూల్ మంజూరు చేశారని అన్నారు. మట్టిలో మాణిక్యాలను గుర్తించి వారి ప్రతిభకు ప్రోత్సాహం కల్పించాలన్న ఆశయంతో..పల్లెల నుంచి ప్రపంచ ఛాంపియన్ల ను తీర్చిదిద్దాలన్న సంకల్పంతో.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జూలైలో సి ఎం కప్ రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించుటకు రంగం సిద్ధమవుతోంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో డివైస్ఓ సర్దార్ సింగ్, జూనియర్ అసిస్టెంట్ లావణ్య కుమారి,కోచ్ పైడిమల్ల సందీప్, రెజ్లింగ్ కోచ్ సతీష్, హ్యాండ్ బాల్ కోచ్ కుమార్, సైక్లింగ్ కోచ్ శ్రీరామ్, తదితరులు పాల్గొన్నారు.