బోగాత జలపాతానికి వెళ్లి తప్పిపోయిన ఎన్ఐటి విద్యార్థులు
– అప్రమత్తమైన పోలీస్, అటవీ శాఖ సిబ్బంది రాత్రి ఆపరేషన్‌తో సురక్షితంగా రక్షణ
వెంకటాపురం, జులై 27, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలం పరిధిలోని మహితాపురం వద్ద ఉన్న నిషేధిత బొగత జలపాతానికి వెళ్లిన ఏడుగురు ఎన్ ఐ టి విద్యార్థులు అర్ధరాత్రి అడవిలో దారి తప్పి పోయారు. శనివారం సాయంత్రం నుంచి వారు కనిపించక పోవడంతో వెంకటాపురం పోలీసు, అటవీ శాఖ అధికారులు అప్రమత్తమై, రాత్రంతా ఆపరేషన్ నిర్వహించి వారిని ఆదివారం తెల్లవారు ఝామున సురక్షితంగా రక్షించారు. వారంతా వరంగల్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT)లో మూడవ సంవత్సరం ఇంజినీరింగ్ విద్యార్థులు. ఈ ఏడుగురిలో ముగ్గురు విద్యార్థినులున్నారు. శనివారం సాయంత్రం బొల్లారం మార్గంగా జలపాతాన్ని దర్శించేందుకు వెళ్లిన వారు అక్కడ తీవ్ర వర్షం పడటంతో పాటు చీకటి కమ్ముకోవడంతో దారి తప్పిపోయారు. గూగుల్ మ్యాప్ సహాయంతో ముందుకెళ్లే ప్రయత్నంలో వారు అడవిలో చిక్కుకుపోయారు. భయాందోళనకు గురైన విద్యార్థు లు డయల్ 100 నంబర్‌కు కాల్ చేసి సహాయం కోరారు. సమాచారం అందుకున్న వెంకటాపురం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బి. కుమార్, ఎస్‌ఐ తిరుపతిరావు నేతృత్వంలో పోలీసులు, అటవీ శాఖ అధికారులు కలసి దాదాపు 25 మందితో కూడిన రెస్క్యూ బృందం రంగంలోకి దిగింది. అడవిలో గంటల తరబడి శోధన కొనసాగించి, రాత్రి 11 గంటల ప్రాంతంలో విద్యార్థులను గుర్తించి క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. వెంటనే వారికి ఆహారం అందించడంతో పాటు, వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తల్లిదండ్రులు వచ్చి తమ పిల్లలను సురక్షితంగా రక్షించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. అటవీ శాఖ నిబంధనల ప్రకారం మహితాపురం, వీరభద్రవరం, కొంగాల జలపాతాలను పర్యాటకుల సందర్శనకు నిషేధ ఆజ్ఞలు ఉన్నాయి.