చిత్రకళ ఉపాధ్యాయునికి జాతీయ స్థాయి ప్రతిభా ఘట్టం
ఏటూరునాగారం,జూలై 26, తెలంగాణ జ్యోతి : మండలం లోని చిన్నబోయినపల్లిలో ఆర్ట్ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్న దేవరాయ రమేష్ జాతీయ స్థాయి చిత్రకళా అవార్డుకు ఎంపికయ్యారు. సూరో భారత్ సంగీత కళానికేతన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ చిత్రకళ పోటీల్లో ఆయన తన అద్భుత కళా ప్రతిభను ప్రదర్శించి అవార్డుకు అర్హత సాధించారు. రమేష్ గతంలో ఎటూరునాగారం, తాడ్వాయి, మంగపేట, ములుగు జిల్లాల్లోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఆర్ట్ టీచర్‌గా విధులు నిర్వహిస్తూ, అనేక విద్యార్థులకు చిత్రకళలో ప్రోత్సాహం అందించారు. ఆయన శిక్షణలో ఎంతోమంది విద్యార్థులు బహుమతులు, అవార్డులు సాధించారు. ఇటీవల క్రియేటివ్ ఆర్ట్ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ – కట్రేనికోన, కోనసీమ (ఆంధ్రప్రదేశ్) వారు నిర్వహించిన 2025 జాతీయ చిత్రలేఖన పోటీల్లో కూడా ఆయన శిష్యులు ప్రశంసనీయ స్థాయిలో ప్రతిభ కనబర్చారు. రమేష్‌ను స్థానిక పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు హర్షధ్వానాలతో అభినందించారు.