ఎదిర ఉపాధ్యాయుడికి జాతీయ స్థాయి చిత్రలేఖన పురస్కారం
వెంకటాపురం, జూలై 21, తెలంగాణజ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలం ఎదిర గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు పర్శిక నాగేశ్వరరావుకు రాజమండ్రికి చెందిన క్రియేటివ్ ఆర్ట్స్ సంస్థ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన జాతీయ స్థాయి చిత్రలేఖన పోటీలో “గ్రేట్ క్రియేటివ్ ఆర్టిస్ట్” అవార్డు లభించింది. పాకిస్తాన్ ఉగ్రవాదులపై చేపట్టిన “ఆపరేషన్ సింధూర్” అనే అంశంపై జరిగిన ఈ పోటీల్లో దేశ వ్యాప్తంగా 15 రాష్ట్రాల నుండి సుమారు 300 మంది కళాకారులు పాల్గొన్నారు. ఈ పోటీ ఫలితాలను క్రియేటివ్ ఆర్ట్స్ అధినేత అంజి అకొండి వెల్లడించగా వచ్చే నెల ఆగస్టులో అవార్డు ప్రదానం జరగనుంది. ప్రస్తుతం అవార్డు గ్రహీత పర్శిక నాగేశ్వరరావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఉప్పరిగూడెం ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అదేవిధంగా ఆదివాసి టీచర్స్ ఫెడరేషన్ (ఎ.టి.ఎఫ్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శిగా సేవలందిస్తున్నారు.ఈప్రతిష్టాత్మక అవార్డు పొందిన పర్శిక నాగేశ్వరరావును గ్రామస్థులు, స్నేహితులు, సహచర ఉపాధ్యాయులు, ఎ.టి.ఎఫ్ బృందం, కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు హర్షాతిరేకాలతో అభినందించారు.