వైభవంగా మే 1న నాంచారమ్మ జాతర
వైశాఖ పౌర్ణమి వేళ వారం రోజుల మహోత్సవాలు
వెంకటాపూర్, మార్చి 27, తెలంగాణ జ్యోతి : ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ పౌర్ణమి సందర్భంగా వైభవంగా నిర్వహించే ఎరుకల నాంచారమ్మ జాతర ఈ ఏడాది మే 1న ఘనంగా నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ చైర్మన్ లోకిని రాజు తెలిపారు. శుక్రవారం మండలంలోని రామానుజాపూర్ పరిధిలో జాతర ఏర్పాట్లకు ముందస్తుగా ఆలయ శుద్ధి కార్యక్రమాలు చేపట్టి, పసుపు కుంకుమలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం ములుగు జిల్లా అధ్యక్షుడు కేతిరి బిక్షపతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో లోకిని రాజు మాట్లాడుతూ, కాకతీయుల కాలంలో సుమారు 800 సంవత్సరాల క్రితం రామప్ప దేవాలయంతో పాటు రామానుజాపూర్ గ్రామ సమీపంలో ఎరుకల నాంచారమ్మ పంచకూటాలయం నిర్మించబడిందన్నారు. 2018 ఏప్రిల్ 29న మొదటిసారిగా జాతర ప్రారంభించామని పేర్కొన్నారు. నాలుగు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చే ఈ జాతరలో చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాదిగా వచ్చే భక్తుల కోసం అధికారుల సహకారంతో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. నాంచారమ్మ ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈసారి జాతర విజయవంతం కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు, అన్ని జిల్లాల నాయకులను ఆహ్వానించాలని కోరుతూ, స్థానికుల సహకారం అవసరమని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కోనేటి రాజు, కూతాటి శ్రీనివాస్, మానుపాటి రమేష్, పల్లకొండ ఎల్లా స్వామి, పోనీ సదానందం, మేడ బంగారయ్య, సాగర్, రాంబాబు, కింసారం రాజు, కేతిరి సారయ్య తదితరులు పాల్గొన్నారు.








