పురుగుల మందు తాగి మున్సిపాలిటీ కార్మికుడి ఆత్మహత్య
ములుగు ప్రతినిధి, సెప్టెంబర్ 4,తెలంగాణజ్యోతి : ములుగు మున్సిపాలిటీలో పరిశుద్ధ కార్మికునిగా పనిచేస్తున్న మైదం మహేష్ (30) రెండు నెలలుగా వేతనం రాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆయన ను సహోద్యోగులు వెంటనే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం దుర్మరణం చెందాడు. మహేష్‌కు భార్యతో పాటు ముగ్గురు చిన్నారులు ఉన్నారు. అధికారుల నిర్లక్ష్యంతో జీతం రాకపోవడమే మహేష్ మృతికి కారణమని తోటి కార్మికులు, దళిత ప్రజాసంఘాల నాయకులు ఆరోపించారు. ఆయన కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించడంతో పాటు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. సంఘటనల నేపథ్యంలో ఉద్రిక్తతలు చోటు చేసుకోవచ్చనే కారణంగా పోలీసులు మున్సిపల్ కార్యాలయం పరిసరాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు.