డెంగ్యూ, మలేరియా నివారణకు మున్సిపాలిటీ ప్రత్యేక చర్యలు
ములుగు, జూలై 11, తెలంగాణ జ్యోతి : వర్షాకాలంలో మస్కీతో వ్యాధుల విస్తరణను అడ్డుకునేందుకు ములుగు మున్సిపాలిటీ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. గడి గడ్డ ప్రాంతంలో మున్సిపాలిటీ అధికారులు, వైద్య శాఖ సహకారంతో గురువారం ఇంటింటి సందర్శన కార్యక్రమాన్ని చేపట్టారు. హెల్త్ అసిస్టెంట్లు, ఆశా కార్యకర్తల బృందాలు ప్రజలతో ముఖాముఖి మాట్లాడి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులపై అవగాహన కల్పించారు. ఇళ్ల చుట్టుపక్కల నీటి నిల్వలు తొలగించాలని, డెంగ్యూ, మలేరియా నివారణకు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల శుభ్రత కూడా ఆరోగ్యానికి ఎంతో అవసరమని తెలియజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ వర్షాకాలం మస్కీ వ్యాధులకు అనుకూలంగా మారుతుందని, అందువల్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, మున్సిపాలిటీ తరఫున పరిశుభ్రతా చర్యలు కొనసాగుతాయని, ప్రజలు భాగస్వామ్యం కావాలని తెలిపారు.