ప్రణాళికాబద్ధంగా మున్సిపాలిటీ అభివృద్ధి పనులు
– ప్రజల అభ్యున్నతే లక్ష్యం : మున్సిపల్ కమిషనర్ సంపత్ రెడ్డి
ములుగు ప్రతినిధి, జూలై3, తెలంగాణ జ్యోతి : ములుగు మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా కొనసాగిస్తున్నామని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగ కుండా అన్ని చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ జి. సంపత్ రెడ్డి తెలిపారు. గురువారం గాంధీ పార్క్ హాల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్షాకాలం నేపథ్యంలో పట్టణంలో శుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ప్రతి వారం వార్డుల వారీగా స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించి ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నామని పేర్కొన్నారు. పారిశుధ్య నిర్వహణలో ఏవైనా సమస్యలు తలెత్తినా తన దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరారు. ప్రత్యేక దృష్టితో మురుగునీటి నిర్వహణ, మొక్కల పంపిణీ : మురుగు కాలువల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారించి నట్టు తెలిపారు. మొక్కల పెంపకాన్ని ప్రోత్సహిస్తూ ప్రతి ఇంటికీ మొక్కల పంపిణీ చేపడతామని, పర్యావరణ పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా ముందుకెళ్తున్నామని తెలిపారు. సైడ్ కాలువల నిర్మాణానికి నిధులు మంజూరైతే వెంటనే చర్యలు చేపడతా మని వెల్లడించారు.గ్రామాల్లో కూడా సమగ్ర పర్యవేక్షణ: ములుగు మున్సిపాలిటీ పరిధిలోని గ్రామాలైన బండారుపల్లి, జీవంతరావుపల్లి ప్రాంతాల్లో మున్సిపల్ సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. నీటి సరఫరా, లీకేజీలపై తనిఖీ : మున్సిపల్ కమిషనర్ జి. సంపత్ రెడ్డి ములుగు లోని యాదవనగర్, వీవర్స్ కాలనీ, బండారుపల్లి ఎస్సీ కాలనీ వాటర్ ట్యాంక్ పరిసరాలు, సందర్శించి, నీటి సరఫరా మరియు లీకేజీ పాయింట్లను పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వలపై ఆందోళన వ్యక్తం చేస్తూ సంబంధిత సిబ్బందిని వెంటనే చర్యలు తీసు కోవాలని ఆదేశించారు. జాప్యం చేసినవారిపై కఠిన చర్యలు తప్పవని ఆదేశించారు.