రెడ్ జోన్ లో ములుగు జిల్లా.. అప్రమత్తంగా ఉండాలి…

రెడ్ జోన్ లో ములుగు జిల్లా.. అప్రమత్తంగా ఉండాలి...

రెడ్ జోన్ లో ములుగు జిల్లా.. అప్రమత్తంగా ఉండాలి…

– గంగమ్మతల్లి, సమ్మక్క సారలమ్మల ఆశీస్సులు మనపై ఉంటాయి

– రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి దనసరి అనసూయ (సీతక్క)

– ములుగు కలెక్టరేట్ లో వరదలపై ఆఫీసర్లతో సమీక్ష

ములుగు ప్రతినిధి , జులై 23, తెలంగాణ జ్యోతి : వర్షాలే పడటంలేదని రైతులు ఎదురు చూసిన నేపథ్యంలో అకస్మాత్తుగా వాతావరణం మారిపోయిందని, ఈనెల 27వరకు ములుగు జిల్లాలో భారీవర్షాలు ఉన్నట్లు వాతావరణశాఖ హెచ్చిరించిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ అన్నారు. ములుగు జిల్లా వర్షాల అలర్ట్స్ లో రెడ్ జోన్ లో ఉందని, గంగమ్మ, మేడారం సమ్మక్క, సారలమ్మ తల్లుల ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉంటాయని స్పష్టం చేశారు. బుధవారం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అధ్యక్షతన వరదలపై సంసిద్ధత కోసం సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్, డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవి చందర్, అదనపు కలెక్టర్లు మహేందర్ జీ, సంపత్ రావులతో కలిసి విధ శాఖల అధికారులు వరద ముప్పును ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న చర్యలపై మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయం తో పనిచేయాలని, గతంలో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా ముందస్తుప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. వరదలతో ఎలాంటి నష్టం కలిగినా పరిహారం చెల్లిస్తామేమో కానీ ప్రాణాలు మాత్రం తీసుకురాలేమని పేర్కొన్నారు. 24గంటలు ఆఫీసర్లు విధుల్లో ఉండి ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు ములుగు జిల్లా నుంచే సముద్రంలో కలిసేందుకు వెళ్తుందని, గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు అధికారుల సూచనలు తప్పక పాటించాలన్నారు. గత ఏడాది టోర్నడో గాలులు సృష్టించిన విధ్వంసం మరువ లేనిదని, ఊర్ల మీద పడితే తీవ్రనష్టం జరిగేదన్నారు. లక్షల చెట్లు నేలకూలాయని, రోడ్లు దెబ్బతిన్నాయన్నారు. గోదావరి నీరు ఏటూరునాగారం, మంగపేటలోకి రాకుండా కరకట్టల నిర్మాణం జరుగుతోందని, త్వరలో పూర్తిచేస్తామన్నారు. వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు సోకకుండా వైద్య సిబ్బంది క్యాంపుఉల నిర్వహిస్తూ అప్రమత్తంగా ఉండాలని, నిరంతరం పారిశుద్ధ కార్యక్రమాలను నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఎప్పుడూ వరద ముప్పు జరిగిన రాత్రి వేళలో జరుగుతుండడంతో ప్రాణ నష్టం జరుగుతోందని, దీనిని దృష్టిలో ఉంచుకొని జరిగే ముప్పును అంచనా వేసి ప్రజలను అప్రమత్తం చేస్తూ సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మంత్రి తెలిపారు. 805చెరువులు ఉన్నాయని, ఐబీ ఆఫీసర్లు నిత్యం షెట్టర్లు, కట్టలను పరిశీలిస్తూ ఉండాలన్నారు. అత్యవసర సమయాలలో డబ్బులను వాడుకోవడానికి కలెక్టర్లకు ఇటీవలనే ముఖ్యమంత్రి ప్రత్యేక నిధులను కేటాయించారని, రాష్ట్రంలోనే ములుగు జిల్లాను రెడ్ జోన్ గా వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారని తెలిపారు. ఈనెల 27 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రభుత్వ ఉద్యోగులు సెలవులపై వెళ్లవద్దని కోరారు. చేపల వేటకు వెళ్లే వారిని కట్టడి చేయాలని, ప్రమాదకరంగా ఉన్న రోడ్లపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని అన్నారు. గతంలో జరిగిన చావులు, విషాదాలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ మాట్లాడు తూ భారీ వర్షాల కారణంగా 11స్థలాలలో ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉండడంతో ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకుని జిల్లా పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉందని, డీడీఆర్ఎఫ్ బలగాలను సిద్ధం చేశామని వివరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment