బీసీలకు 42% రిజర్వేషన్ అమలుపై మంత్రి శ్రీధర్ బాబుకు ఘన సన్మానం
కాటారం, జూలై 14, తెలంగాణ జ్యోతి : తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించి రాజకీయ ప్రాతినిధ్యానికి న్యాయం చేసినందుకు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబును కాటారం బీసీ నాయకులు ఘనంగా సన్మానించారు. సోమవారం కాటారం వచ్చిన సందర్భంగా అంబేడ్కర్ కూడలిలో మంత్రి శ్రీధర్ బాబుకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేస్తూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు మాట్లాడుతూ, దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడం గర్వకారణమన్నారు. గతంలోనే టీఆర్‌ఎస్ హయాం లో బీసీలకు సముచిత హక్కులు, మున్నూరు కాపుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు అంశాలను శ్రీధర్ బాబు శాసనసభలో ప్రస్తావించారని గుర్తు చేశారు. ఆయన కృషి ఫలితంగా ఇప్పుడు అన్ని బీసీ కులాలకూ ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పడినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు చీమల సందీప్, టౌన్ అధ్యక్షుడు పసుల మొగిలి, ప్రైవేట్ పాఠశాలల సంఘ నాయకుడు కొట్టే శ్రీశైలం, బెల్లంకొండ రామన్న, కామిడి వెంకటరెడ్డి, దోమల రాజశేఖర్, పెండ్యాల సత్యనారాయణ, బొమ్మ సమ్మరెడ్డి తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు.