పూజారి కొడుకు ప్రమాదం పట్ల మంత్రి సీతక్క బాధ్యత వహించాలి
సీతక్క, కాంగ్రెస్ సర్కారు వనదేవతలనూ వదల్లేదని ఆగ్రహం
మంత్రి పొంగులేటితో కలిసి రూ.200 మింగేశారని ఆరోపణ
మంత్రుల అవినీతికి బాలుడు కాళ్లు విరిగిపోయాయని మండిపాటు
రెడ్కో మాజీ చైర్మన్ వై.సతీష్ రెడ్డి
ములుగు, మార్చి 27, తెలంగాణ జ్యోతి : మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర అభివృద్ధి పనుల్లో నాణ్యతా లోపాల కారణంగా ఆలయ పూజారి కుమారుడు ప్రమాదానికి గురైన ఘటనపై రాష్ట్ర మంత్రి సీతక్క బాధ్యత వహించాలని రెడ్కో మాజీ చైర్మన్ వై. సతీష్ రెడ్డి డిమాండ్ చేశారు. శతాబ్దాల పాటు నిలిచేలా నిర్మాణాలు చేస్తున్నామని ప్రభుత్వం చెప్పుకున్నప్పటికీ జాతర ముగిసిన మూడు నెలలకే రాతి కట్టడాలు కూలిపోవడం పనుల నాణ్యతను ప్రశ్నార్థకంగా మార్చిందన్నారు. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ఆలయ పూజారి రమేష్ కుమారుడు ప్రమాదానికి గురై కాళ్లు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.200 కోట్ల నిధులను దుర్వినియోగం చేసి నాణ్యతా లోపాలతో పనులు నిర్వహించారని విమర్శించారు. సీతక్క, కాంగ్రెస్ సర్కారు వనదేవతలనూ వదల్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మంత్రి పొంగులేటితో కలిసి రూ.200 కోట్లు మింగేశారని ఆరోపించారు. మంత్రుల అవినీతికి బాలుడు కాళ్లు విరిగిపోయాయని మండిపడ్డారు. ఈ ఘటనకు రాష్ట్ర మంత్రి సీతక్క పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ, బాధిత బాలుడికి ప్రభుత్వ ఖర్చుతో అత్యుత్తమ వైద్యం అందించడంతో పాటు కుటుంబానికి తగిన ఆర్థిక సహాయం చేయాలని కోరారు. కమిషన్ల కోసం పనులు నాణ్యతా ప్రమాణాలు లేకుండా నిర్వహించడం వనదేవతలను అవమానించినట్టేనని పేర్కొన్నారు. తాను గిరిజన బిడ్డనని చెప్పుకునే మంత్రి సీతక్క మేడారం గద్దెల నిర్మాణంలో ఆ బాధ్యతను విస్మరించారని, అక్కడి పనుల పరిస్థితి చూస్తే కమిషన్లకే ప్రాధాన్యత ఇచ్చినట్లు స్పష్టమవుతోందన్నారు. నిర్మాణాల్లో లోపాలపై బీఆర్ఎస్ పార్టీ ముందుగానే హెచ్చరించినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని తెలిపారు. పార్టీ నాయకులు స్వయంగా పరిశీలించి లోపాలను బయటపెట్టినా చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మేడారం అభివృద్ధి పనుల్లో జరిగిన అవినీతి ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని, అవసరమైతే ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రితో సహా కేబినెట్ మొత్తానికి బాధ్యత ఉందనే అనుమానం తలెత్తుతుందని సతీష్ రెడ్డి వ్యాఖ్యానించారు.










