ములుగులో మోడల్ బస్టాండ్ పనులను పరిశీలించిన మంత్రి సీతక్క
ములుగు, మార్చి 21, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా కేంద్రంలో రూ. 4.80 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న నూతన ఆర్టీసీ మోడల్ బస్టాండ్ పనులను రాష్ట్ర మంత్రి సీతక్క శనివారం పరిశీలించారు. నిర్మాణ ప్రాంగణాన్ని సందర్శించిన మంత్రి పనుల పురోగతిపై అధికారులతో ఫోన్లో మాట్లాడి, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని ఇంజినీర్లు, కాంట్రాక్టర్లకు ఆదేశించారు. ప్రజలకు ఆధునిక రవాణా సదుపాయాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. బస్టాండ్లో వేచిచోట్ల, తాగునీరు, మరుగుదొడ్లు, పార్కింగ్ వంటి వసతులు కల్పిస్తామని చెప్పారు. ఈ బస్టాండ్ ములుగు జిల్లా అభివృద్ధికి కీలకమని, పూర్తయ్యాక ప్రయాణికులకు మరింత సౌకర్యం కలుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పైడాకుల అశోక్, బానోత్ రవిచందర్, రేగ కళ్యాణి, చింతనిప్పుల బిక్షపతి, ఇతర ప్రజాప్రతినిధులు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.





