ముప్పనపల్లి సహాయ నిధి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం
రక్తదాతలకు ధన్యవాదాలు తెలిపిన అధ్యక్షుడు అబ్బు సతీష్
తెలంగాణజ్యోతి, సెప్టెంబర్9, కన్నాయిగూడెం: మండలం లోని ముప్పనపల్లి సహాయ నిధి ఆధ్వర్యంలో మంగళవారం రైతు వేదికలో మెగా రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ శిబిరంలో స్థానిక రక్తదాతలు స్వచ్చందంగా ముందుకు వచ్చి 64 యూనిట్ల రక్తాన్ని అందించారు. సేకరించిన రక్తాన్ని భద్రాచలం రెడ్‌క్రాస్ బ్రాంచ్‌కు హస్తాంతరం చేసినట్టు సహాయ నిధి అధ్యక్షుడు అబ్బు సతీష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “కన్నాయిగూడెం మండల ప్రజల సహకారంతో శిబిరం విజయవంతమైంది. రక్తదానం ప్రాణదానం తో సమానం. ప్రతి ఒక్కరు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని సమాజానికి తోడ్పడాలి” అని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ MPP జనగం సమ్మక్క, మెడికల్ ఆఫీసర్ స్నేహారెడ్డి, వ్యవసాయ అధికారి మహేష్ మాట్లాడుతూ, అన్ని దానాల్లో రక్తదానం గొప్పదని, రక్తదానం ద్వారా అనేకమంది ప్రాణాలు కాపాడ వచ్చని పేర్కొన్నారు. సమాజంలో రక్త కొరత లేకుండా అడుగులు వేస్తున్న ముప్పన పల్లి సహాయ నిధి అధ్యక్షుడు అబ్బు సతీష్, సభ్యుల కృషి ప్రశంసనీయమని అన్నారు. రక్తదాతలకు ప్రశంసాపత్రాలు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో సహాయ నిధి సభ్యులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.