MEDARAM | మేడారం జాతర ఏర్పాట్లు శాశ్వతంగా ఉండేలా చేయాలి
– వసతులపై ప్రత్యేక దృష్టి – మాస్టర్ ప్లాన్‌పై కమిటీ సమీక్షించాలి
– ఎండోమెంట్స్ కార్యదర్శి శైలజా రామయ్యర్ సూచన
ములుగుప్రతినిధి, జూలై3, తెలంగాణజ్యోతి : రెండేళ్లకోసారి నిర్వహించే శ్రీ సమ్మక్క సారలమ్మ మేడారం మహా జాతరకు అన్ని ఏర్పాట్లు భక్తుల అవసరాలకు అనుగుణంగా, శాశ్వతంగా ఉండేలా చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ఎండోమెంట్స్ శాఖ ప్రధాన కార్యదర్శి శైలజా రామయ్యర్ అధికారులను ఆదేశించా రు. బుధవారం తాడ్వాయి మండలంలోని మేడారం ఐటీడీఏ గెస్ట్ హౌస్ సమావేశ మందిరంలో 2026 మహా జాతర ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఎండోమెంట్స్ అడ్వైజర్ గోవింద హరి, ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శైలజా రామయ్యర్ మాట్లాడుతూ ప్రతి జాతర కోసం వందల కోట్ల నిధులు కేటాయించుతున్నాం. కానీ వాటి ప్రయోజనం తాత్కాలికంగా కాకుండా శాశ్వత సౌకర్యాలుగా ఉండాలని, భక్తుల ఇబ్బందులను నివారించేలా ముందస్తుగా పక్కా ప్రణాళి కలతో పనులు చేపట్టాలని తెలిపారు. మేడారానికి వచ్చే కోటిన్నర భక్తుల రాకపోకల సౌలభ్యం కోసం స్టూడియో వన్ ఆర్కిటెక్చర్ రూపొందించిన మాస్టర్ ప్లాన్‌ను కమిటీ స్థాయిలో పూజారులు, అధికారులు, సంబంధిత శాఖలతో సమీక్షించి తగిన నివేదికను అందించాలని సూచించారు. గత జాతర అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ఏర్పాట్లు నాణ్యత తో సమయానికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశం అనంతరం శైలజా రామయ్యర్, కలెక్టర్ దివాకర టి.ఎస్., గోవింద హరి కలసి జంపన్న వాగు, చిలుకలగుట్ట, కన్నెపల్లి సారలమ్మ ఆలయాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అనంతరం మేడారంలోని వనదేవతలను దర్శించుకున్నారు. పూజారులు డోలు వాయిద్యాలతో స్వాగతం పలికి గద్దెపైకి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సీహెచ్ మహేందర్ జీ, సంపత్ రావు, ఆర్డీవో వెంకటేష్, ఏపీఓ వసంత రావు, ఈఓ వీరస్వామి, పూజారుల సంఘం అధ్యక్షులు జగ్గారావు, పూజారులు, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.