మేడారం జాతర పనులు నిర్దిష్ట గడువులోపు పూర్తి చేయాలి
— మాస్టర్ ప్లాన్ ప్రకారం వేగంగా పూర్తిచేయాలని మంత్రుల ఆదేశం
ములుగుప్రతినిధి, డిసెంబర్12,తెలంగాణజ్యోతి:ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన మేళా అయిన మేడారం మహా జాతరకు సంబంధించి జరుగుతున్న అభివృద్ధి పనులను మాస్టర్ ప్లాన్ ప్రకారం, నాణ్యత లోపించకుండా, నిర్ణయించిన సమయానికి పూర్తిచేయాలని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ధనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు. శుక్రవారం తాడ్వాయి మండలంలోని సమ్మక్క–సారలమ్మ గద్దెల పునరుద్ధరణ, పగిడిద్దరాజు–గోవిందరాజుల గద్దెల రాతి నిర్మాణాలు, ఆలయ ప్రాంగణ ఫ్లోరింగ్, రాతి స్తంభాల నిర్మాణం, జంపన్న వాగు వద్ద జరుగుతున్న పనులను వారు ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ “పనుల నాణ్యతపై ఎలాంటి రాజీ ఉండదు… ప్రతి పని ప్రమాణాలకు లోబడి వేగంగా పూర్తవాలి” అని అధికారులను, గుత్తేదారులను ఆదేశించారు. వచ్చే జనవరి 28 నుంచి జాతర ప్రారంభం కానున్నందున, భక్తులు అమ్మవార్ల గద్దెలను సునాయాసంగా దర్శించు కునేలా అన్ని ఏర్పాట్లు ముందుగానే సిద్ధంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే భక్తుల రాక ప్రారంభమైన నేపథ్యంలో, పనులు మూడు షిఫ్టుల్లో నిర్వహించి వేగం పెంచాలి, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని మంత్రులు ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఆదివారం భారీ భక్తుల రద్దీ ఉండే అవకాశం ఉన్నందున, అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, పూజారులు, ఆర్‌అండ్‌బీ, ఇంజనీరింగ్ అధికారులు, జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.







