భారీగా టేకు కలప పట్టివేత
రెండు వాహనాలు స్వాధీనం – కేసు నమోదు
వెంకటాపురం, ఆగస్టు3, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం ఫారెస్ట్ రేంజ్ పరిధిలో ఆదివారం తెల్లవారు జామున టేకు కలప అక్రమ రవాణాపై అటవీ శాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. నమ్మదగిన సమాచారం ఆధారంగా అప్రమత్తమైన అధికారులు, సతీష్‌గడ్ ప్రాంతం నుండి రెండు వేర్వేరు పికప్ వాహనాల్లో టేకు దుంగలు తరలిస్తున్న దృశ్యాలను గుర్తించి, వాటిని అదుపులోకి తీసుకున్నారు. రామచంద్రపురం సమీపంలో ఒక వాహనం, వెంకటాపురం మండల కేంద్రంలోని శివాలయం వద్ద మరో వాహనాన్ని అధికారులు అడ్డగించారు. ఈ వాహనాల్లో ఒక్కొక్కటిలో ఎనిమిది టేకు దుంగలు లభ్యమయ్యాయి. స్వాధీనం చేసుకున్న కలప విలువ సుమారు రూ. 4 లక్షలకుపైగా ఉంటుందని వెంకటాపురం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శుద్ధపల్లి వంశీకృష్ణ తెలిపారు. పట్టుబడిన వాహనాలను వెంకటాపురం ఫారెస్ట్ కార్యాలయానికి తరలించిన అధికారులు, ఈ అక్రమ రవాణాపై కేసు నమోదు చేసి, సంబంధిత నివేదికను ఫారెస్ట్ ఉన్నతాధికారులకు అందించారు. ఈ దాడిలో రామచంద్రపురం సెక్షన్ ఆఫీసర్లు, ఫారెస్ట్ బీట్ అధికారులు లక్ష్మయ్య, శేషు, బేస్ క్యాంప్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.