మరికల్ రిషి హై స్కూల్ విద్యార్థులు రాష్ట్రస్థాయి యోగ పోటీలకు ఎంపిక
నారాయణపేట, ఆగస్ట్ 3, తెలంగాణజ్యోతి : నారాయణపేట జిల్లాలో నిర్వహించిన జిల్లా స్థాయి యోగ పోటీలలో అద్భుతం గా రాణించి రాష్ట్రస్థాయి పోటీలకు శ్రీ గణేష్, విఘ్నేష్, చరణ్ తేజ్‌లు ఎంపికయ్యారు. విద్యార్థులు రాష్ట్రస్థాయి యోగ పోటీలకు ఎంపిక కావడం పాఠశాలకే కాదు, మండలానికి కూడా గర్వకారణంగా మారింది. వీరి విజయాన్ని మెచ్చుకుంటూ జిల్లా విద్యాశాఖాధికారి గోవిందరాజు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ బాలాజీ, పతాంజలి అధ్యక్షులు సురేష్ కుమార్, అశోక్, మహబూబ్‌నగర్ జనరల్ సెక్రటరీ సాయికుమార్ తదితరులు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. విద్యార్థులకు శిక్షణ ఇచ్చి అండగా నిలిచిన పీఈటీ ఇన్‌చార్జ్ బాల్ రాజ్ కృషి విద్యార్థుల విజయానికి బలమైన ఆధారంగా నిలిచిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రిషి హై స్కూల్ కరస్పాండెంట్ నెల్లికొండి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం పాఠశాల గర్వించదగ్గ విషయమని, వారు మరింతగా ఎదగడానికి అవసరమైన అన్ని విధాలా మేము సహకరిస్తామని తెలిపారు. రాష్ట్ర స్థాయిలోనూ మరింత ప్రతిభ చాటాలని ఆశాభావం వ్యక్తం చేశారు.