మావోయిస్టులు లొంగిపోయి ప్రశాంత జీవనం సాగించాలి
– జిల్లా ఎస్పీ డాక్టర్ పి.శబరీష్
– ములుగులో ఏడుగురు మావోయిస్టు సభ్యుల లొంగుబాటు
ములుగు ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : ఏళ్ల తరబడి అజ్క్షాత వాసం చేస్తూ అడవుల్లో జీవిస్తున్న మావోయిస్టులు ప్రభుత్వం కల్పిస్తున్న పునరావాస పథకాన్ని సద్వినియోగం చేసుకొని లొంగిపోవాలని, కుటుంబ సభ్యులతో ప్రశాంత జీవనం కొనసా గించాలని జిల్లా ఎస్పీ డాక్టర్ పి.శబరీష్ పిలుపునిచ్చారు. శనివారం ములుగు జిల్లా పోలీసు కార్యాలయంలో లొంగి పోయిన మావోయిస్టుల సభ్యుల వివరాలను ఎస్పీ మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. కాలం చెల్లిన సిద్ధాంతాలతో యువత జీవితాలతో ఆడుకోవద్దని, వెంటనే లొంగిపోవాలన్నారు. ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుందన్నారు. పోరుకన్నా ఊరుమిన్న, మన ఊరికి తిరిగి రండి కార్యక్రమంలోభాగంగా ఏడుగురు సభ్యులు లొంగి పోయారన్నారు. వారిలో ఒకరు ఏరియా కమిటీ సభ్యుడు, ముగ్గురు పార్టీ సభ్యులు, ఒకరు పూజారి కాంకేర్ ఏరియా అధ్యక్షుడు, మరొకరు సభ్యుడు, చైతన్య నాట్య మండలి సభ్యురాలు ఉన్నారు. 2025 జనవరి నుంచి ఇప్పటివరకు 80మంది వివిధ హోదాల్లో పనిచేసిన మావోయిస్టులు లొంగిపోయారని ఎస్పీ తెలిపారు. అందులో ముగ్గురు డివిజన్ కమిటీ సభ్యులు, ఆరుగరు ఏరియా కమిటీ సభ్యులు, 11మంది పార్టీ సభ్యులు, 25మంది మిలీషియా సభ్యులు, తదితర హోదాల్లో పనిచేసిన వారు ఉన్నారన్నారు. మావోయిస్టు పార్టీ క్షీణిస్తున్న తరుణంలో ప్రభుత్వ పిలుపును అందుకొని క్యాడర్ తో కలిసి లొంగిపోవాలని ఎస్పీ పిలుపునిచ్చారు. లొంగిపోయిన ఏడుగురు సభ్యులకు తక్షణ సాయంగా రూ.25వేల చొప్పున చెక్కులను పంపిణీ చేశారు. మిగిలిన రూ.7లక్షల మొత్తాన్ని హోదాలను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండర్ నారాయణ తుకారాం, ములుగు డీఎస్పీ ఎన్.రవీందర్, సీఐ ఎం.రమేష్, ఎస్సైలు తిరుపతిరావు, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.