కర్రెగుట్టల ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు చందు మృతి
కన్నాయిగూడెం, తెలంగాణజ్యోతి : ములుగు జిల్లా కన్నాయి గూడెం మండలం ఏటూరు గ్రామానికి చెందిన సాధనపల్లి చందు అలియాస్ రవి(24) ఇటీవల కర్రెగుట్టలలో జరిగిన ఎన్‌కౌంటర్ లో మృతి చెందాడు. అన్నపూర్ణ వెంకటేశ్వర్ల దంపతుల రెండో కుమారుడైన చందు ఇంటర్మీడియట్ వరకు చదివి భద్రాచలంలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేసి, 2 సంవత్సరాల క్రితం మావో యిస్టు ఉద్యమంలో చేరాడు. వారం రోజుల క్రితం కర్రెగుటలలో జరిగిన ఎన్కౌంటర్లో చందు తుది శ్వాస విడిచాడు. మావోయిస్టు పార్టీలో బెటాలియన్ డాక్టర్ టీం కమాండర్గా దామోదర్‌కు రైట్ హ్యాండ్‌గా కీలక పాత్ర పోషించిన చందుపై రూ. 8 లక్షల రివార్డు ఉన్నట్టు సమాచారం. ఛత్తీస్‌గఢ్ పోలీసులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు గురువారం అప్పగించగా ఏటూరులో అంత్యక్రియలు నిర్వహించారు. రవి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకు న్నాయి.