ఆవకాయ పచ్చడి సీజన్‌కు ధరల దెబ్బ
– తెలుగింటి సంప్రదాయానికి తగిన పరీక్ష
వెంకటాపురం,నూగూరు,మే31,తెలంగాణజ్యోతి.: తెలుగువారి వంటింట పచ్చడి లేని ముద్ద దిగదు. ఇంట్లో ఎన్ని రకాల కూరలు ఉన్నా ఆవకాయ పచ్చడి ఉండకపోతే ముద్ద దిగదన్నట్లు ఆవకాయకు ఉన్న ప్రాధాన్యం మరోసారి రుజువు అవుతోంది. అయితే ఈసారి ఆవకాయ పచ్చడి సీజన్‌కు ధరలు పెరిగిపోయాయి. వేగంగా మారుతున్న మార్కెట్ ధరలు గృహిణులను ఇబ్బందుల్లోకి నెట్టి “రేట్లు పెరిగినా పచ్చడి మాత్రం మానలేం” అనే ఆత్మస్థైర్యంతో పచ్చడి తయారీకి ఉత్సాహంగా వ్యవహరిస్తున్నారు. వెంకటాపురం, వాజేడు మండలాల్లో ఇటీవల జరిగిన భారీ వర్షాలు, ఈదురుగాలుల వల్ల మామిడి పంట తీవ్రంగా నష్టపోయింది. ఫలితంగా స్థానికంగా పచ్చడి కాయలు తగ్గిపోవటంతో, దూర ప్రాంతాల నుండి కాయలు తెచ్చుకుంటున్నారు. నాణ్యమైన ఒక్కో మామిడి కాయ ధర రూ.8 వరకు పలుకుతోంది. అంతేకాదు, పచ్చడి తయారీలో అవసరమయ్యే వేరుశనగ నూనె, నువ్వుల నూనె, ఆవాలు, మెంతులు, వెల్లుల్లి ధరలు భారీగా పెరిగాయి. అయితే కారం మాత్రం గత ఏడాదితో పోలిస్తే స్వల్పంగా ధర తగ్గింది. పచ్చడి ముక్కలు కోసేందుకు ఉపయోగించే కత్తిపీటలకు కూడా డిమాండ్ పెరగడంతో, వాటి అమ్మకాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలోనూ, కుటుంబ అవసరాల మేరకు పచ్చడి తయారీ లో గృహిణులు దూసుకుపోతున్నారు. జాడీల్లో నిల్వ చేసుకునే లా సంవత్సరం పొడవునా వాడుకునేందుకు ఇప్పటినుండే సిద్ధమవుతున్నారు.