మేడారంలో ఘనంగా మండ మెలిగే పండుగ వేడుకలు…

మేడారంలో ఘనంగా మండ మెలిగే పండుగ వేడుకలు…

ములుగు, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : మేడారం మహా జాతరకు అంకురార్పణలో ప్రధాన ఘట్టం మండమెలిగే మండ మెలిగే పండుగను బుధవారం ఘనంగా నిర్వహించారు. మహా జాతరకు సరిగ్గా వారం ముందు ఆలయ పూజారులు ఈ పండుగను నిర్వహించడం ఆనవాయితీ గా వస్తోంది. మండ మెలిగే పండుగతో జాతర ప్రారంభమైనట్లుగా ఆదివాసీ లు భావిస్తారు. సమ్మక్క కొలువైన మేడారం, సారలమ్మ ఉన్న కన్నెపల్లి, కొండాయిలోని గోవిందరాజులు, పూనుగొండ్లలోని పగిడిద్దరాజు గుడులను వేకువజామునే పూజారులు ఆలయాలను పుట్టమట్టితో గుడులు అలికి… మామిడి తోరణాలతో పూజారులు అలంకరణ చేశారు. మేడారంలోని సమ్మక్క ప్రధాన పూజారి ఇంటి నుంచి డప్పుచప్పుళ్లు, డోలు వాయిద్యాల నడుమ పసుపు, కుంకుమలతో మేడారం చుట్టూ ఊరేగింపు నిర్వహించి, గిరిజన ఆడపడుచులు సమ్మక్క గుడికి వెళ్లి పూజలు, గ్రామ బొడ్రాయికి శుద్ధ జలంతో అభిషేకాలు, పూజలు నిర్వహించి బూరుగు కొమ్మలతో దిష్టి తోరణాలు కట్టారు. ఆదివాసీ ఆచార సంప్రదాయాల ప్రకారం ఉపవాస దీక్షలతో మండమెలిగే పండుగ చేస్తారు. ఇవాళ రాత్రి గద్దెల చెంత పూజలు చేసి తల్లులకు నైవేద్యాలు సమర్పించి రేపు ఉదయం వరకు పూజలు నిర్వహిస్తారు. 21 నుండి 24 వ తేదీ వరకు నాలుగు రోజులపాటు అసలు జాతర ప్రారంభం కానుంది. మొదటి రోజున సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవిందరాజులను గద్దెల వద్దకు తీసుకొస్తారు. ఇక రెండో రోజు చిలకలగుట్ట దిగి సమ్మక్క గద్దెల వద్దకు చేరుకుంటుంది. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment