తెలంగాణలో మహిళా శక్తి క్యాంటీన్ సర్వీస్‌లు త్వరలో ప్రారంభం
తెలంగాణ జ్యోతి, హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అన్ని ప్రధాన కార్యాలయాలు, కలెక్టరేట్లు, పర్యాటక ప్రాంతాలు, దేవాల యాలు, బస్టాండ్లు, పారిశ్రామిక ప్రాంతాల్లో మహిళా సంఘాల నిర్వహణలో మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేయను న్నట్టు సీఎస్ వెల్లడించారు. ఈ క్యాంటీన్ల నిర్వహణను గ్రామీణ సంఘాలకే అప్పగిస్తామని చెప్పారు. క్యాంటీన్ నిర్వహణపై ఈ సంఘాలకు ప్రత్యేక శిక్షణ కూడా ఇవ్వ నున్నట్లు తెలిపారు. ఇప్పటికే కేరళలో ‘అన్న’ క్యాంటీన్ల పేరుతో, బెంగాల్ లో ‘దీదీ క రసోయ్’ పేరుతో నడుస్తున్న క్యాంటీన్ల పనితీరుపై అధ్యయనం చేశామని వివరించారు. వచ్చే రెండేళ్లలో కనీసం 150 అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. ఈ క్యాంటీన్ల పనితీరు, నిర్వహణ, వాటి ఏర్పాటుకు ఎంత స్థలం కావాలి, వాటి ఏర్పాటుకు రోడ్ మ్యాప్ తదితర అంశాలపై సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్‌ను సీఎస్ ఆదేశించారు.ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిట్టల్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ అనితా రామచంద్రన్, ఆరోగ్యశాఖ కమిషనర్ కర్ణన్, దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, పర్యాటక శాఖ డైరెక్టర్ నిఖిల, టూరిజం కార్పొరేషన్ ఎండీ రమేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.