వెంకటాపురంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
సామాజిక విప్లవకారుడి సేవలను స్మరించిన నాయకులు
వెంకటాపురం (నూగూరు), ఏప్రిల్ 11, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహం ఆవరణంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. మండల ఎమ్మార్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు యాసం రమేష్ మాదిగ మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే వైతాళికుడు, గొప్ప సామాజిక విప్లవకారుడు, అణగారిన వర్గాల ఆశాజ్యోతి అని కొనియాడారు. భారతదేశంలో మహిళలు, బహుజనులు విద్యా అవకాశాల నుంచి దూరంగా ఉన్నారనే వాస్తవాన్ని తొలిసారిగా గుర్తించిన మహానీయుడు పూలే అని తెలిపారు. ఆయన భార్య సావిత్రిబాయి పూలే 1848 జనవరి 1న బాలబాలికల కోసం, ముఖ్యంగా దళిత బాలికల విద్య కోసం తొలి పాఠశాలను ప్రారంభించి, భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా చరిత్ర సృష్టించారని గుర్తుచేశారు. ఆ కాలంలో బ్రాహ్మణవాద వ్యతిరేక పరిస్థితుల్లో ఎన్నో అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ పూలే దంపతులు తమ లక్ష్యాన్ని వదలకుండా విద్యా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారని అన్నారు. ఇలాంటి మహనీయుల త్యాగాలను ఎప్పటికీ మరువలేమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు యాసం మహేష్ మాదిగ, కోకిల మల్లికార్జున్ మాదిగ, కనుక ముత్తయ్య మాదిగ, కొడారి సత్యం మాదిగ, గుగ్గిళ్ల కళ్యాణ్ మాదిగ, చెన్నం సత్యం మాదిగ తదితరులు పాల్గొన్నారు.









