మావోయిస్టు పార్టీని వీడిన మచ్చ సోమయ్య

Written by telangana jyothi

Published on:

మావోయిస్టు పార్టీని వీడిన మచ్చ సోమయ్య

– భూపాలపల్లి ఎస్పీ ముందు లొంగుబాటు

– 32 ఏళ్ల అజ్ఞాతంనుంచి జనంలోకి 

భూపాలపల్లి ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : మావోయిస్టు పార్టీ దండకారణ్య ఏరియాలో పనిచేస్తున్న మచ్చ సోమయ్య అలియాస్ సమ్మయ్య ఉరఫ్ సురేందర్, అలియాస్ సతీష్ భూపాల పల్లి ఎస్సీ కిరణ్ ఖరే ఎదుట శనివారం లొంగిపోయారు. చత్తీస్ గడ్ లోని దండకారణ్య అటవీ ప్రాంతంలో సాయుధ పోరాటం సాగిస్తున్న సోమన్న సరెండర్ కావడం స్థానికంగా సంచలనంగా మారింది. 32 ఏళ్ల క్రితం అడవిబాట పట్టిన సోమన్న జన జీవనంలో కలిసేందుకు ముందుకు వచ్చారని ఎస్సీ కిరణ్ ఖరే ప్రకటించారు. ఆయనపై ఉన్న రూ. 8 లక్షల రివార్డు అతనికి అందిస్తామని, పునరావసం పథకం ద్వారా లబ్ది చేకూరుస్తామని వెల్లడించారు.

 రెండు రోజుల క్రితమే సోమన్న కుటుంబాన్ని కలిసి ఎస్పీ

“పోరు కన్నా ఊరు మిన్న… మన ఊరికి తిరిగి రండి” అనే కార్యక్రమంలో భాగంగా భూపాల పల్లి ఎస్పీ కిరణ్ ఖరే, అడిషనల్ ఎస్పీ బోనాల కిషన్, డీఎస్సీ ఏ సంపత్ రావు, సీఐ నరేష్ కుమార్, ఎస్సైలు సుధాకర్, రమేష్ లు గురువారం పంబాపూర్ గ్రామానికి వెళ్లారు. గ్రామంలో నివాసం ఉంటున్న మచ్చ సోమయ్య భార్య సుగుణమ్మ ఇతర కుటుంబ సభ్యులకు బాసటగా నిలిచారు. ఈ సందర్భంగా దశాబ్దాలుగా అజ్ఞాతంలో ఉన్న సోమన్నను బాహ్య ప్రపంచంలోకి రావాలని సూచించాలని, ఎస్పీ అతని కుటుంబ సభ్యులకు సూచించారు. సోమన్న జన జీవనంలో కలిస్తే అతనిపై ఉన్న రివార్డు అతనికే ఇస్తామని, తెలంగాణ ప్రభుత్వం తరుపున అండగా నిలుస్తామని ఎస్సీ ప్రకటించారు. అయితే సోమన్న రెండు రోజులకే భూపాలపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయంలో లోంగిపోయాడు .

 సోమన్న నేపథ్యం..

ప్రస్తుతం దండకారణ్య అటవీ ప్రాంతంలో జిల్లా కమిటీ కార్యదర్శి హోదాలో ఉన్న మచ్చ సోమన్న క్రాంతికారి జనతన్ సర్కార్ వ్యవసాయ వ్యవహారాల బాధ్యతలను పర్యవేక్షిస్తు న్నారు. అలా గే దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (డీకెఎస్ జెడ్ సీ)లోని సౌత్ బస్తర్ డీవీసీగా కూడా వ్యవహరిస్తున్నారు. 1990లో పీపుల్స్ వార్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ రైతు కూలీ సంఘంలో పని చేస్తున్న క్రమంలో 1992లో అరెస్ట్ అయ్యాడు. అప్పటి మహదేవపూర్ ఏరియా కమిటీ సెక్రటరీగా పని చేసిన గాలి ఆగయ్య అలియాస్ జనార్దన్ ప్రసంగాలకు ప్రభావితుడై విప్లవపంథా వైపు సాగాడు. జైలు నుండి బయటకు వచ్చిన తరువాత 1993లో పెద్దారెడ్డి అలియాస్ వెంకన్న నేతృత్వంలో ఉన్న ఏరియా కమిటీలో సభ్యునిగా పని చేశాడు. 1995లో ఏరియా కమిటీ సభ్యునిగా, 1998లో కూకటి వెంకటి అలియాస్ రమేష్ అలియాస్ వికాస్ దళంలో డిప్యూటీ కమాండర్ గా, 2003లో డీవీసీఎంగా పనిచేసిన సోమన్న మహదేవపూర్ ఏరియా కమిటీ కార్యదర్శిగా పనిచేశాడు. తెలంగాణాలో మావోయిస్టుల ఉనికి తగ్గుముఖం పడుతున్న క్రమంలో పార్టీ 2007లో సోమన్నను పార్టీ నాయకత్వం నార్త్ తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ (ఎన్టీఎస్ జెడ్ఎస్ సీ) నుండి (డీకెఎస్ జెడ్ సి) కి పంపించింది. సౌత్ బస్తర్ లో జనతన్ సర్కార్ లో వ్యవసాయ వ్యవహారాలు (కృషి విభాగ్)ను పర్యవేక్షించిన సోమన్న ఆదివా సీలకు వ్యవసాయంలో మెలుకువలు నేర్పించడంతో పాటు చెరువులు తవ్వించి నీటి వనరుల సౌకర్యాలను కల్పించడంతో పాటు తాగునీటి అవసరాలు తీర్చేందుకు 200 బోర్ వెల్స్ తవ్వించేందుకు కృషి చేశాడు.

 సోమన్న ఉద్యమకాలంలో పాల్గొన్న ఘటనలు..

సోమన్న 1998లో గండి కామారం సమీపంలో జరిగిన ఎదురు కాల్పుల్లో పాల్గొన్నాడు. ఈ ఘటనలో చిట్యాల దళ కమాండర్ వెంకన్న మరణించగా మిగతా దళ సభ్యులు తప్పించు కున్నారు. 2002లో సింగారం, పందిపంపుల, 2018లో దూలేడు, 2024 లో పాలగూడెంలలో జరిగిన ఎదురు కాల్పుల ఘటనల్లో పాల్గొ న్నాడు. చివరకు 32 ఏళ్ల అజ్ఞాతం నుండి జనజీవన స్రవంతిలో కలిశాడు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now