ములుగులోని స్థానిక సమస్యలు పరిష్కరించాలి : డివైఎఫ్ఐ
మౌలిక వసతుల లోపంపై ఆందోళన
చర్యలు లేకపోతే ఉద్యమాలు తప్పవు
ములుగు, ఏప్రిల్ 8, తెలంగాణ జ్యోతి: ములుగు మున్సిపాలిటీ పరిధిలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సరఫరా, పారిశుధ్యం, వీధి లైట్లు తదితర మౌలిక సదుపాయాల లోపం తీవ్రంగా ఉందని డివైఎఫ్ఐ మండల అధ్యక్షుడు చింతరాజు విమర్శించారు. బుధవారం డివైఎఫ్ఐ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు ప్రాథమిక సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గుంతలతో నిండిన రోడ్ల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, డ్రైనేజీ సరిగా లేక మురికి నీరు వీధుల్లో నిలిచి వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని అన్నారు. తాగునీటి సమస్య కూడా తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. నేషనల్ హైవే పక్కన ఫుట్‌పాత్‌లు, డ్రైనేజీలపై టీ పాయింట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హోటళ్లు ఏర్పాటు చేయడం వల్ల పాదచారులకు ఇబ్బందులు కలుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సమస్యలను గుర్తించి పరిష్కరించకపోతే డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో విస్తృత ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎం.డి ఫరూక్, బెనర్జీ, శివ, సూరి, నితిన్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.









