మండలంలో జోరుగా సాగుతున్న మద్యం దందా..!

Written by telangana jyothi

Published on:

మండలంలో జోరుగా సాగుతున్న మద్యం దందా..!

– మద్యం అమ్మకాలపై కరువైన నిఘా .. మత్తులో అధికారులు..?

కన్నాయిగూడెం, తెలంగాణ జ్యోతి : మండలంలోని పలు గ్రామాలలో బెల్టు దందా జోరుగా సాగుతూ మద్యం ఏరులై పారుతుంది. బెల్ట్ షాపుల్లో విచ్చలవిడిగా మద్యం విక్రయిస్తున్నా నియంత్రించాల్సిన అధికారులు వాటివైపు కన్నెత్తి చూడగా పోవడంపై నిద్రమత్తుల్లో అధికారులు ఉన్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. సాధారణ సమయాల్లో బెల్ట్ షాపులను వైన్స్ యాజమాన్యమే అనధికారికంగా నడిపిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే…

      ఎలక్షన్ కోడ్ అమల్లో ఉందా లేదా ..?

ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు అన్ని రకాల కార్యకలాపాలు ఎన్నికల సంఘం నియంత్రణలోకి వస్తాయి. అలాంటప్పుడు ఈ బెల్ట్ దందాకు మాత్రం ఇంత స్వేచ్చ ఎలా వచ్చిందని, రోడ్లపై వాహనాలను తనిఖీ చేస్తూ నగదు,ఇతర వస్తువులు నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తే పట్టుకొని సీజ్ చేస్తున్న అధికార యంత్రాంగం, బెల్ట్ షాపులకు సరఫరా అవుతున్న మద్యంపై ఎందుకు ఫోకస్ చేయడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. చట్ట విరుద్ధంగా వందలాది కాటన్ల మద్యం, బీర్లు మారుమూల ప్రాంతాలకు సైతం తరలి వెళుతుంటే నిఘా నేత్రాల చూపు మందగించిందా అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. వైన్స్ దుకాణాల యాజమాన్యం కనుసన్నల్లోనే విచ్చలవిడిగా మద్యం దందా జరుగుతుంటే ఎన్నికల కోడ్ వర్తించదా? లేక ఎలక్షన్ కమీషన్ కూడా అక్రమ మద్యాన్ని కంట్రోల్ చేయలేక పోతుందా అనే అనుమానాలను అనేక మంది వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు అనగానే మొదటగా గుర్తుచ్చోది మద్యం, తర్వాత మనీ, మద్యం లేకుండా ఎన్నికలు జరగవని అందరికీ తెలిసిందే. మరి అంతగా ఎన్నికలను ప్రభావితం చేసే మద్యం అడ్డూ అదుపూ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా వైన్స్ షాపుల నుండి బెల్ట్ షాపులకు తరలిస్తూ రాత్రి పగలు తేడా లేకుండా అమ్మకాలు జరుపుతుంటే ఎక్సైజ్, పోలీస్ శాఖ అధికారులకు తెలియదా లేక మామూలు(ళ్ల) సమయంలో లాగే ఎన్నికల కోడ్ ఉన్నా వైన్స్ ఓనర్స్ కు సహకరిస్తున్నారా? అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వాలను, రాజకీయ పార్టీలను కంట్రోల్ చేసే ఎన్నికల కమిషన్, బెల్ట్ షాపులను నియంత్రించలేక పోతుందా? అనేది వెయ్యి డాలర్ల ప్రశ్నగా మారింది.

బెల్ట్ షాపుల దోపిడి…

సాధారణ సమయంలో ఎమ్మార్పీ ధర అంటే క్వార్టర్ కి రూ.20 నుండి రూ.30, బీరుకు రూ.30 నుండి రూ.50 అదనంగా బాదే బెల్ట్ నిర్వాహకులు, ఎన్నికల కోడ్ నేపథ్యంలో అదనంగా మరో 20 నుండి 30 రూపాయలు గుంజుతూ అధిక దోపిడికి పాల్పడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని మద్యం ప్రియులు మనో వేదనకు గురవుతున్నారు. ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో దృష్టి సారించి, బెల్ట్ షాపుల బెండు తీసి, అక్రమంగా బెల్ట్ దందా చేసే వారిపై కఠినచర్యలు తీసుకొని, ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా చూడాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now