కుండపోత వర్షాలతో స్తంభించిన జనజీవనం
– వెంకటాపురం, వాజేడు మండలాల్లో పొంగిపొర్లుతున్న వాగులు
వెంకటాపురం, జూలై 23, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లో కుండపోత వర్షాలు ముంచెత్తడంతో పల్లపు ప్రాంతాలు జలమయమై జనజీవనం పూర్తిగా స్తంభించి పోయింది. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. వెంకటాపురం మండల కేంద్రం శివాలయం రహదారి నిర్మాణంలో ఉన్న కంకలవాగు వంతెన వరద ప్రవాహంలో మునిగిపోయింది. బెస్తగూడెం ఇటుక బట్టీల దారిలోకి వర్షపు నీరు ప్రవేశించింది. చర్ల-వెంకటాపురం రహదారిలో రాళ్లవాగు వంతెన మరమ్మత్తుల కారణంగా వేసిన తాత్కాలిక అప్రోచ్ రోడ్డుకు గండి పడటంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ వాగు వద్ద పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కే. తిరుపతిరావు నేతృత్వంలో బారికేడ్లు ఏర్పాటు చేసి ‘రాకపోకల నిషేధం’ బోర్డులు ఏర్పాటు చేశారు. వాగులు, కాలువల వద్ద చేపల వేటకు వెళ్లొద్దని, వరద ప్రవాహాల్లోకి దిగొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ యంత్రాంగం విజ్ఞప్తి చేసింది. వాజేడు మండలంలోని బొగత జలపాతం ప్రవాహం తీవ్రమవడంతో పర్యాటకుల సందర్శనను తాత్కాలికంగా నిలిపివేశారు. అలాగే పాలెం ప్రాజెక్టు పూర్తిగా నిండిపోవడంతో అన్ని గేట్లు ఎత్తివేసి గోదావరిలోకి అదనపు నీటిని విడుదల చేశారు. చెరువులు, కుంటలు నిండి అలుగుల ద్వారా నీరు వెలుపలికి ప్రవహిస్తోంది. అంతేకాకుండా రాబోయే 48గంటలు భారీవర్షాలు కొనసాగనుండటంతో వెంకటాపురం మరియు వాజేడు మండలాల్లో ప్రజలను మరోసారి అప్రమత్తం చేశారు.