మచ్చాపూర్ డబుల్ బెడ్ రూమ్ కాలనీలో రోడ్లులేక బురదలో కూరుకుపోతున్న జీవితం
– అధికారుల నిర్లక్ష్యంపై వాసుల తీవ్ర ఆవేదన, స్పందించకపోతే ఉద్యమానికి సిద్ధమన్న ప్రజలు
గోవిందరావుపేట, జూలై 29, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని మచ్చాపూర్ గ్రామ డబుల్ బెడ్ రూమ్ కాలనీలో వాసులు తీవ్ర అసంతృప్తితో రోడ్డెక్కారు. కాలనీలో కనీస సౌకర్యాలు లేక, ముఖ్యంగా సీసీ రోడ్ల నిర్మాణం లేకపోవడంతో వర్షాకాలంలో తాము అనుభ విస్తున్న ఇబ్బందులు తట్టుకోలేక అధికారుల నిర్లక్ష్యాన్ని గట్టిగా ప్రశ్నిస్తున్నారు.వర్షాలు పడిన ప్రతీసారి కాలనీ మార్గాలు బురదతెన్నులుగా మారి పోతున్నాయని, స్కూల్‌కి వెళ్లే చిన్నారులు, వృద్ధులు ప్రతి రోజు నీటిలో మునిగిపోయే రహదారుల్లో నడవాల్సి వస్తోందని వాసులు వాపోతున్నారు. గుంతలు, నిలిచిపోయిన నీటి వల్ల వాహనాలు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య పరిస్థితులు మరింత దిగజారినట్టు వాసులు చెబుతున్నారు. ప్రతి ఇంట్లో ఒకరు, ఇద్దరు విష జ్వరాలతో బాధపడుతుండటం, దోమల ఉధృతికి కారణమైన డ్రైనేజీల నిర్వహణలో ఘోర నిర్లక్ష్యం కొనసాగుతోందని ఆరోపించారు. వారానికి ఒకసారైనా కాలనీలో మురుగు కాలువలు శుభ్రం చేయకపోవడం, నీరు నిలిచి దుర్వాసన వెదజల్లే పరిస్థితి నెలకొన్నదని అన్నారు. ప్రభుత్వ నిధులు ఖర్చయినా ఉపయోగపడకపోవడం బాధాక రమని వాసులు వాపోయారు. ఇన్ని సమస్యలపై ఎన్నిసార్లు గ్రామ కార్యదర్శి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సరైన స్పందన లేదని, బాధ్యతల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహ రిస్తున్నారని విమర్శించారు. కాలనీలో శాశ్వత రహదారి నిర్మాణంతో పాటు పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరిచేలా తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా, మండల అధికారులు స్పందించి కాలనీ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఉద్యమానికి సిద్ధమవుతామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.