మావోయిస్టులకు వ్యతిరేకంగా కరపత్రాల కలకలం
వెంకటాపురం, జులై 14, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధిలోని పలు గ్రామాల్లోని రహదారుల పై మావోయిస్టులకు వ్యతిరేకంగా కరపత్రాలు సోమవారం వెలిసాయి. మావోయిస్టులను ఉద్దేశిస్తూ “మావోయిస్టు ఆత్మ పరిరక్షణ ప్రజా ఫ్రంట్ తెలంగాణ” పేరిట విడుదలైన ఈ లేఖల్లో “సిద్ధాంతం కోసం అడివి పాలైన అన్నల్లారా, అక్కల్లారా! మీరు నమ్మిన సిద్ధాంతం సామాన్యునికి ఆశాకిరణం అయ్యిందా? మీ పోరాటం ఆత్మసంతృప్తిని ఇచ్చిందా? ప్రజాధరణ కోల్పోయిన మీ ఉద్యమ బాట ఇప్పుడు మోడువారిన భూమిలా మారి పోయింది” అంటూ విమర్శలు చేయడం జరిగింది. మావోయిస్టు అగ్రనాయకులను ఉద్దేశించి, “ఇకనైనా మీ కాలం చెల్లిన సిద్ధాంతాన్ని వదిలి, కాలానుగుణంగా మారిన ప్రజల జీవన విధానంలో భాగస్వాములవండి. అడవిని విడిచి ప్రజల్లోకి రండి, ప్రజాస్వామ్య గొంతుక కండి. ఆయుధాలు మనకొద్దు – ప్రజామోద మార్గమే ముద్దు. మీ మేధస్సును ప్రజల అభివృద్ధికి వినియోగించండి” అంటూ పిలుపు ఇచ్చారు. ఈ కరపత్రాలు వెలవడి స్థానికంగా కలకలం రేపాయి.