మున్సిపాలిటీ కార్మికుడి మృతిపై కేటీఆర్ ఆరా
– ఫోన్‌లో మృతుని తల్లికి పరామర్శ
– పిల్లల పేర్లపై ఆర్థిక సాయం భరోసా
ములుగు ప్రతినిధి, సెప్టెంబర్7, తెలంగాణజ్యోతి : ములుగు మున్సిపాలిటీలో పెండింగ్ జీతాలు రాక మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి కార్మికుడు మైదం మహేశ్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరా తీశారు. రెడ్‌కో మాజీ చైర్మన్ వై.సతీశ్‌రెడ్డి ఆదివారం మాధవ రావు పల్లిలోని మృతుని కుటుంబాన్ని పరామర్శించి, కేటీఆర్ తో ఫోన్‌లో మాట్లాడిం చారు. కేటీఆర్‌తో మాట్లాడిన మృతుని తల్లి ఆరు నెలలుగా జీతం రాకపోవడంతో కష్టాల్లో మునిగి పోయి భార్యా పిల్లలతో ఆకలితో వేదన అనుభవించి చివరకు స్మశానంలో పని చేస్తూ మున్సిపాలిటీ వాళ్లు ఇచ్చిన గడ్డి మందు తాగి చని పోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం విని కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసి ఆందోళన చెందవద్దు పార్టీ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తరఫున ముగ్గురు ఆడపిల్లల పేర్లపై ఆర్థిక సాయాన్ని 2 రోజుల్లో అందిస్తామని భరోసా ఇచ్చారు. మృతుని కుటుంబానికి న్యాయం జరిగే వరకు కుటుంబానికి ఉంటామని సతీశ్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ములుగు మండల అధ్యక్షుడు సానికొమ్ము రమేష్ రెడ్డి, పోరిక పుమా నాయక్, వేములపల్లి బిక్షపతి, పోరిక విజయ్ రామ్ నాయక్, కోగిల మహేష్, గరిగే రఘు, ఆకుతోట చంద్రమౌళి,నర్రా భద్రయ్య, గణేష్, మహేందర్, చంటి, తదితరులు పాల్గొన్నారు.