భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి
బేసిక్ ధర కోసం న్యాయ కమిషన్ ఏర్పాటు డిమాండ్
సి.ఐ.టి.యు జిల్లా కార్యదర్శి బాల్‌రాం
భూ నిర్వాసితుల సంఘం అధ్యక్షుడు మచ్చేందర్ డిమాండ్
నారాయణపేట, జూలై 30, తెలంగాణ జ్యోతి : కొడంగల్ ఎత్తిపోతల పథకం కోసం భూములు కోల్పోతున్న రైతులకు సరైన పరిహారం కల్పించేందుకు బేసిక్ ధరను నిర్ణయించేందుకు ప్రత్యేక న్యాయ కమిషన్ ఏర్పాటు చేయాలని సి.ఐ.టి.యు జిల్లా కార్యదర్శి బాల్‌రాం, భూ నిర్వాసితుల సంఘం జిల్లా అధ్యక్షుడు మచ్చేందర్ డిమాండ్ చేశారు. భూ నిర్వాసితుల రిలే నిరాహార దీక్షలు 16వ రోజుకు చేరుకున్న సందర్భంగా బుధవారం దీక్షా శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరైన బాల్‌రాం మాట్లాడుతూ, “రైతు తన భూమిని ప్రాజెక్టుకు సంతోషంగా ఇవ్వాలంటే ప్రభుత్వం న్యాయమైన పరిహారం ఇవ్వాలి” అన్నారు. రూ.4,500 కోట్ల వ్యయంతో నిర్మించబోయే ప్రాజెక్టులో భూ నిర్వాసితులకు మాత్రం తక్కువ పరిహారం ఎందుకని ప్రశ్నించారు. కాంట్రాక్టర్ల ఖర్చులు పెరిగితే వాటిని ప్రభుత్వం పెంచుతున్నప్పటికీ, రైతులకు మాత్రం ‘కాన్సెంటు అవార్డు’ పేరుతో ఏకరానికి రూ.14 లక్షలు మాత్రమే ఇవ్వడం అన్యాయం అని విమర్శించారు. “తరాలుగా సాగు చేస్తున్న భూమిని రైతులు ప్రభుత్వం అవసరాలకు అప్పజెప్పుతున్నారు. కనీసం న్యాయమైన పరిహారం ఇవ్వకపోతే రైతుల న్యాయ పోరాటం కొనసాగుతుంది” అని హెచ్చరించారు. ఈ సందర్భంగా కాచ్వార్, ఎర్నాగన్‌పల్లి గ్రామాల నిర్వాసితులు కలాల్ రాజు, నగేష్ గౌడ్, బస్వరాజ్ గౌడ్, రఘురెడ్డి, తిమ్మారెడ్డి, రాఘవేందర్ రెడ్డి తదితరులు రిలే నిరాహార దీక్షల్లో పాల్గొన్నారు.