కన్నాయిగూడెంలో జర్నలిస్టుల నిరసన
కన్నాయిగూడెం, జూన్ 25, తెలంగాణ జ్యోతి : తాడ్వాయి మండలానికి తాడ్వాయి మండలానికి చెందిన ఆంధ్రజ్యోతి విలేకరి శ్రీకాంత్ రెడ్డిపై జరిగిన దాడిని ఖండిస్తూ మండల కేంద్రం లో విలేకరులు నిరసన చేపట్టారు. నిజాయితీగా, ధైర్యంగా వాస్తవాలు రాసే విలేకరులపై ఇలా దాడులు జరగడం హేయ మైన చర్య అని వారు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో పాత్రికేయులు కీలకంగా పనిచేస్తుంటే వారి గౌరవాన్ని కించపరిచే లా దాడులు జరగడం ఖండనీయం అని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కి వినతిపత్రం అందజేశారు. దాడికి పాల్పడినవారిని వెంటనే గుర్తించి, విచారణ జరిపి, జర్నలిస్టుల రక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. జర్నలిస్టులపై దాడులు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యతను ప్రభుత్వం నిర్వర్తించాలని వారు స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో కన్నాయిగూడెం మండలానికి చెందిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ ఐక్యంగా పాల్గొన్నారు.