ఎమ్మెల్యే దుర్భాషలపై విలేకరుల రాస్తారోకో
క్షమాపణ చెప్పాలని జర్నలిస్టులో డిమాండ్
భూపాలపల్లి, జులై 21, తెలంగాణ జ్యోతి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కాకతీయ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం జర్నలిస్టులు స్థానికఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు విలేకరులపై చేసిన దుర్భాషలను ఖండిస్తూ నల్లబ్యాడ్జీ లతో నిరసన చేపట్టారు. ఆదివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశానికి ముందు ఎమ్మెల్యే చేసిన దుర్భాషలపై స్పందించిన మీడియా ప్రతినిధులు, ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి మంత్రుల పర్యటన కార్యక్రమాలను బహిష్కరించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. అనంతరం అంబేద్కర్ సెంటర్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించి, ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. విలేకరులను ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడిన ఎమ్మెల్యే తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. రాస్తారోకో కారణంగా ట్రాఫిక్ నిలిచి పోవడంతో పోలీసులు సీఐ నరేష్ కుమార్, ఎస్సై సాంబమూర్తి లు అక్కడికి చేరుకుని జర్నలిస్టులకు సమాధానమిచ్చి ధర్నాను విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 80 మంది జర్నలిస్టులు పాల్గొన్నారు.