జీవో 49 రద్దు చేయాలి : తుడుం దెబ్బ రాష్ట్ర ప్రతినిధి పోడం బాబు
తెలంగాణ జ్యోతి, కన్నాయిగూడెం, జూలై 18 : జీవో నెంబర్ 49ను వెంటనే రద్దు చేయాలని తుడుం దెబ్బ (ఆదివాసి హక్కుల పోరాట సమితి) రాష్ట్ర అధికార ప్రతినిధి పోడం బాబు డిమాండ్ చేశారు. కన్నాయిగూడెం మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జీవో 49 అమలుతో ఆదివాసీల హక్కులకు అన్యాయం జరుగు తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నాగర్కర్నూల్ జిల్లాల్లో నివసిస్తున్న ఆదివాసులకు ఈ జీవో తీవ్ర నష్టం కలిగిస్తోందన్నారు. “షెడ్యూల్ ప్రాంతాల్లోని ఖనిజ సంపద దోచుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నాటకం ఆడుతు జీవో 49ను తీసుకొచ్చారన్నారు. ఇది ఆదివాసీల జీవన హక్కులను కాలరాస్తోందని పోడం బాబు ఆరోపించారు. ఈ జీవోను రద్దు చేయకపోతే ఐక్య పోరాటాలు తప్పవని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అదేవిధంగా ఆదివాసులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని అటవీ శాఖ అధికారులు అడ్డుకుంటున్నారని, అది సరికాదన్నారు. “ఆదివాసులు అడవిలోనే నివాసముంటారు. వారు నివసించే భూమిలోనే ఇళ్లు నిర్మించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఫారెస్ట్ భూముల్లో నివాసమంటూ ఇళ్ల నిర్మాణాన్ని నిలిపివేయడం అన్యాయంగా మారుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో తుడుం దెబ్బ మండల అధ్యక్షుడు గుండ్ల పాపారావు, యాల మురళి, ఆలం రాంబాబు, కొమరం సంపత్, పోడం శోభన్, ఆలం కుమార్, బొగ్గం బాబు తదితరులు పాల్గొన్నారు.