అమరావతి విద్యాలయంలో అంతర్జాతీయ యోగా వేడుకలు
వెంకటాపూర్, జూన్ 21, తెలంగాణ జ్యోతి : మండలంలోని లక్ష్మీదేవిపేటలో గల అమరావతి విద్యాలయంలో శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు వీరగాని రాజయ్య యోగా ఆసనాలు వేసి విద్యార్థులతో వేయించారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవడానికి యోగా అమూల్యమైన సాధనమని అన్నారు. మన దైనందిన జీవితంలో యోగా ముఖ్య పాత్ర పోషిస్తోందని, మానసిక ప్రశాంతతకు, శారీరక ఆరోగ్యానికి యోగా ఎంతగానో తోడ్పడుతుందని తెలిపారు. యోగ శరీరం, మనస్సు, ఆత్మకు మధ్య సమతుల్యతను సాధించే ప్రాచీన భారతీయ సంప్రదాయ విధానమని అన్నారు. యోగాను ప్రతీ ఒక్కరూ తమ జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా ఉత్తమ ఫలితాలను సాధించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు మూల రాజయ్య, వీరగాని ఆనందం, అంతటి సుమలత, పాఠశాల ఉపాధ్యాయ బృందం జీరి పోతుల కిరణ్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.