వాజేడు మండలంలో ఆర్ఎంపీ క్లినిక్ల తనిఖీలు
వెంకటాపురం, ఆగస్టు29, తెలంగాణజ్యోతి : ములుగు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ గోపాల్ రావు వాజేడు మండలంలోని ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్న ఆర్ఎంపీ ప్రథమ చికిత్స కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హతకు మించి వైద్య సేవలు అందించ రాదని, అధిక మోతాదులో యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ వాడకూడదని ఆదేశించారు. అనవసర రక్తపరీక్షలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేయరాదని హెచ్చరించారు. అలాగే రోగులకు ఇంజెక్షన్లు, ఐవీ ఫ్లూయిడ్స్ వంటివి ఇవ్వరాదని స్పష్టం చేశారు. జ్వరంతో బాధపడుతూ ప్రథమ చికిత్స కేంద్రాలకు వచ్చే రోగులకు అవసరమైన ప్రాథమిక చికిత్స మాత్రమే అందించాలి. తగిన అవసరం ఉన్నపుడు సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తప్పనిసరిగా రిఫర్ చేయాలని తెలిపారు. జ్వరం వచ్చిన ప్రతి రోగి వివరాలను సంబంధిత పీహెచ్సీ వైద్యాధికారులు, సిబ్బందికి తెలియజేయాలని సూచించారు. పై సూచనలను పాటించక పోతే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోబడతాయని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కీటకజనిత వ్యాధుల నియంత్రణ అధికారి డాక్టర్ చంద్రకాంత్, వాజేడు పీహెచ్సీ వైద్యాధికారులు డాక్టర్ మహేందర్, డాక్టర్ మధుకర్, డీఈఓ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రగళ్ళపల్లి గ్రామంలోని ఆర్ఎంపీ క్లినిక్లను కూడా అధికారులు తనిఖీ చేశారు.