వాజేడు, వెంకటాపురం మండలాల మీసేవ సెంటర్ల తనిఖీ
– నిర్ణీత రుసుము కంటే ఎక్కువ వసూలు చేస్తే చర్యలు తప్పవు
– ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్
వెంకటాపురం, సెప్టెంబర్3, తెలంగాణజ్యోతి :ములుగు జిల్లా లోని మీసేవ సెంటర్ల తనిఖీలలో భాగంగా ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్ బుధవారం వాజేడు, వెంకటాపురం (నూగూరు) మండలాల్లోని మీసేవ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జగన్నాధపురం, పేరూరు, వాజేడు, ఆలుబాకా, పాత్రపురం, మోర్రివానిగూడెం కేంద్రాలను సందర్శించి మీసేవ సేవల అందుబాటు, రుసుము వసూలు విధానాన్ని పరిశీలించారు. అవసరమైన అన్ని సేవలను నిర్దేశిత ఈఎస్డీ గైడ్‌లైన్స్ ప్రకారం ఆపరేటర్లు అందించాలన్నారు. భూభారతి సహా అన్ని ఆన్లైన్ సేవలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని సూచిం చారు. అదేవిధంగా ప్రతి మీసేవ కేంద్రంలో సిటిజెన్ చార్టర్, భూభారతి ఫ్లెక్సీలు, మీసేవ లోగో, తహసీల్దార్–ఈడీఎం–పరిష్కారం కాల్ సెంటర్ల ఫోన్ నంబర్లు తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. ప్రజలు ఆధార్ సేవల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో త్వరలోనే వాజేడు, వెంకటాపురం మండల కేంద్రాల్లో కొత్త ఆధార్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. కళ్యాణలక్ష్మి, మరణ ధృవపత్రాలు వంటి ముఖ్యమైన సేవలను ఎలాంటి పొరపాట్లు లేకుండా నమోదు చేయాలని, ప్రజల పట్ల సున్నితంగా ఉండి సమయానికి సేవలు అందించాలని ఆపరేటర్లను హెచ్చరించారు. “నిర్ణీత రుసుము కంటే అదనంగా వసూలు చేస్తే సంబంధిత మీసేవ సెంటర్లపై కఠిన చర్యలు తప్పవు” అని దేవేందర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మీసేవ జిల్లా మేనేజర్ పోలోజు విజయ్, మీసేవ సెంటర్ నిర్వాహకులు పాల్గొన్నారు.