ఆదివాసీ నాయకులపై లంబాడీలు అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు
లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి
గొండ్వాన సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా అధ్యక్షుడు పూనెం ప్రతాప్.
వెంకటాపురం, సెప్టెంబర్4, తెలంగాణ జ్యోతి: లంబాడీలు ఆదివాసీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని, ములుగు జిల్లా గొండ్వాన సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు పూనెం ప్రతాప్ హెచ్చరించారు. గురువారం వెంకటాపురం మండల కేంద్రంలో జరిగిన అత్యవసర సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1950లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో సుగాలీ లు ప్రకాశం, గుంటూరు జిల్లాలలో మాత్రమే ఉండే వారనీ, తెలంగాణ ప్రాంతంలో లంబాడీలు డీనోటిఫైడ్ ట్రైబ్స్గా మాత్రమే పేర్కొన్నారని తెలిపారు. ఎస్టీ హోదా లేదని స్పష్టం చేశారు. 1976లో పార్లమెంట్ చట్టం 108 సవరణ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ సీట్ల పెంపుపై చర్చ జరిగిందని, కానీ లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చే విధంగా ఎటువంటి నోటిఫికేషన్, కమిషన్ రిపోర్టు లేదా ప్రజాభిప్రాయ సేకరణ జరగలేదని వివరించారు. అయినప్పటికీ అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జి.ఓ. 149 ద్వారా కలిపినట్లు చూపించిందన్నారు. 2003లో మళ్లీ సుగాలి, బంజారా, లంబాడాలను కలిపి చూపించారనీ, 1976లోనే కలిపినట్లయితే మరోసారి కలపవలసిన అవసరం ఏమిటని అడిగారు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 342 ప్రకారం లీగల్ ప్రాసెస్‌కు విరుద్ధమని ఎద్దేవా చేశారు. 1971లో ఆదివాసి జనాభా 2,85,226 ఉండగా, లంబాడీలు 1,32,464 మాత్రమే ఉన్నారని, కానీ 2021 నాటికి ఆదివాసులు 9 లక్షలు ఉంటే లంబాడీలు 40 లక్షలు దాటారని గణాంకాలను చూపించారు. ఇది లంబాడీల వలసల వలన జరిగినదేనని పేర్కొన్నారు. మాజీ ఎంపీ సోయం బాబురావు, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు రాజ్యాంగపరమైన డాక్యుమెంట్లతో లంబాడీలు ఎస్టీ జాబితాలో లేరని నిరూపించారని, సుప్రీంకోర్టులో కేసు వేశారని గుర్తుచేశారు. అక్రమ ఆగడాలు ఇక ఎక్కువ కాలం సాగవని, ఆదివాసీ గుడాల నుండి లంబాడా ఉద్యోగులను తొలగిం చేందుకు సిద్ధమవుతున్నామని హెచ్చరించారు. ఈ సమావేశం లో ఆదివాసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.