జోరుగా ఇసుక అక్రమ రవాణా..!
ఆపేదేవరు, అడ్డుకునేదేవరు..?
కన్నాయిగూడెం, అక్టోబర్ 12, తెలంగాణ జ్యోతి : కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం హన్మంత్ వాగులో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. అనుమతులు లేకపోయినా కొందరు దోపిడీ మాదిరిగానే ఇసుకను తరలిస్తుండగా, మరికొందరు అనుమతుల పేరుతో సహజవనరులను దోచుకుంటున్నారు. ఇసుక అక్రమార్కులు అధికారులు పట్టించుకోకపోవడం వల్ల రెచ్చిపోతున్నారు. బుట్టాయిగూడెం హన్మంత్ వాగు నుంచి ఇతర గ్రామాలకు ట్రాక్టర్ల ద్వారా ఇసుకను పెద్ద ఎత్తున అక్రమంగా తరలిస్తున్నారు. కొన్ని రోజులుగా ఈ దందా మూడు ‘పువ్వులు.. ఆరు కాయలు’ గా కొనసాగుతోంది. స్థానికుల ఆరోపణల ప్రకారం… అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులే యథేచ్ఛగా ఈ అక్రమ రవాణాను కొనసాగిస్తున్నట్లు బాహాటంగా చర్చించుకుంటున్నారు. ఇసుకను పెద్ద ఎత్తున తరలించడంతో భూగర్భ జలాలు కూడా అడుగంటి పోతున్నాయని,. ఇంత తంతు జరుగుతున్న మైనింగ్, రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
అధికారుల అండతోనే కొనసాగుతున్న దందా..!
గ్రామ స్థాయి అధికారులలో కొంతమంది కూడా ఇసుక రవాణాలో భాగస్వాములవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండలంలో ఇసుక అక్రమ రవాణాను ప్రశ్నించిన వారిపై అధికార పార్టీ నాయకుల నుంచి బెదిరింపులు వస్తున్నట్లు సమాచారం. పర్మిషన్ లేకుండా ఇసుక తరలిస్తున్నారని ప్రశ్నిస్తే, అధికారుల అండదండలున్నాయని, “ఇష్టం ఉన్నచోట చెప్పుకోండి” అనే రకంగా ఎదురు దాడికి దిగుతున్న సందర్భాలు గ్రామ ప్రజలతో పలు చోట్ల చోటు చేసుకున్నాయి. చిట్యాల, సర్వాయి, ఏటూర్ ప్రాంతాల నుంచి కూడా ఇసుక అక్రమ రవాణా కొనసాగుతున్నది. పట్టు దొరకకుండా ట్రాక్టర్లు రోడ్లపై వేగంగా ప్రయాణించడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.