వాడబలిజల సమస్యలపై శాసన మండలిలో మాట్లాడతాను
– ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
హైదరాబాద్, జూన్ 27, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాలతో పాటు గోదావరి పరివాహక ప్రాంతాలనుండి వాడబలిజ సేవా సంఘం నాయకులు శుక్రవారం హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కలిశారు. క్యూ న్యూస్ కార్యాలయంలో వాడబలిజ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డర్ర దామోదర్ నేతృత్వంలో ఎమ్మెల్సీ మల్లన్నను ఘనంగా సన్మానించారు. అనంతరం సంఘం నాయకులు మాట్లాడుతూ గోదావరి పరివాహక ప్రాంతాల్లో వాడబలిజ కులస్తులు ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న 1/70 యాక్ట్ వంటి చట్టాల కారణంగా భూ హక్కులు కోల్పోయి వివిధ ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. మా జీవన ప్రమాణాలు మారకుండానే ప్రభుత్వాలు మారిపోయాయని, ఈ సమస్యలను శాసన మండలిలో ప్రస్తావించి పరిష్కారం చూపించాలని విజ్ఞప్తి చేస్తూ వినతిపత్రాన్ని అందించారు. వినతిపత్రాన్ని స్వీకరించిన తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ వాడబలిజల కష్టాలను శాసన మండలిలో వినిపించి, బీసీల పక్షాన నిలబడి పోరాడతానని హామీ ఇచ్చారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీసీలకు అధికారాన్ని సాధించేందుకు సమిష్టిగా ముందుకు సాగాలన్నారు. త్వరలోనే వారి ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను చైతన్యం చేస్తానని వెల్లడించారు. ఆ తర్వాత బీసీ జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్యను వాడబలిజ సేవా సంఘం నేతలు మర్యాదపూర్వకంగా కలసి సమస్యలపై వినతిపత్రం అందించారు. విద్యా అభివృద్ధికి బీసీ గురుకులాల స్థాపన, ప్రతి మండలంలో ఏకలవ్య స్కూల్ ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు. కృష్ణయ్య మాట్లాడుతూ వాడబలిజల సమస్యలను రాజ్యసభలో చర్చకు తీసుకు వచ్చి నా వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గగ్గూరి రమణయ్య, టీన్మార్ మల్లన్న టిం సభ్యులు అచ్చునూరి కిషన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు తోట ప్రశాంత్, వాజేడు మండల యూత్ ప్రెసిడెంట్ బొల్లె విజయబాబు, గ్రామ కమిటీ అధ్యక్షులు కొప్పుల రామకృష్ణ, అల్లి నరేష్, ముత్తబోయిన ప్రసాద్, అల్లి రాంబాబు, గగ్గూరి కృష్ణార్జునరావు, కొప్పుల మల్లికార్జునరావు, మెట్టుబెల్లి సుధాకర్, కొప్పుల నారాయణ, కొప్పుల అబ్బాయి తదితరులు పాల్గొన్నారు.