ఐ లవ్ ములుగు
– ఆకర్షణగా ముస్తాబవుతున్న జిల్లా కేంద్రం
ములుగు,అక్టోబర్ 20,తెలంగాణజ్యోతి : జిల్లా కేంద్రంలో కొత్త ఆకర్షణగా ‘ఐ లవ్ ములుగు’ రూపుదిద్దు కుంటోంది. బండారుపల్లి మూలమలుపు వద్ద ఉన్న గవర్నమెంట్ జూనియర్ కాలేజీ కాంపౌండ్ వాల్‌కు ఆనుకుని ఈ శిల్పాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ములుగు పట్టణ సుందరీకరణలో భాగంగా మున్సిపల్ అధికారులు, స్థానిక కళాకారులు కలిసి ఆకర్షణీయంగా ఈ డిజైన్‌ను రూపొందిస్తున్నారు. పర్యాటక శాఖ నిధులతో జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల ఇలాంటి నిర్మాణాలు చేపట్టారు. ఇప్పటికే జంగాలపల్లి క్రాస్ వద్ద సుందర ఆకృత్యాలతో అద్భుతమైన శిల్పాలను ప్రజలకు ప్రకృతి ప్రేమికులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఐ లవ్ ములుగు ఆకృతుని ఎరుపు రంగులో చేతుల ఆకారంలో రూపొందిన గుండె ఆకారం (“♥“) ములుగు అక్షరాలతో కలసి ప్రత్యేకంగా మెరుస్తోంది. శిల్పం చుట్టూ లైటింగ్, వాల్ పెయింటింగ్, వాటర్ ఫ్లోయింగ్ తో అలంకరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. స్థానికులు, విద్యార్థులు, యువత ఈ కొత్త ఆకర్షణతో ఉత్సాహంగా ఫోటోలు, సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు. పట్టణ అందాలను పెంచడమే కాకుండా, ములుగు పట్ల ప్రేమను ప్రతిబింబించే ఈ ‘ఐ లవ్ ములుగు’ శిల్పం త్వరలోనే ప్రజల సందర్శనకు సిద్ధం కానుంది.