హైదరాబాద్ ఎమర్జింగ్ లీగల్ టెక్ హబ్‌గా ఎదుగుతోంది : మంత్రి శ్రీధర్ బాబు
కాటారం, జూలై 26, తెలంగాణ జ్యోతి : హైదరాబాద్ ఇప్పుడు ‘ఎమర్జింగ్ లీగల్ టెక్ హబ్’గా మారుతోందని న్యాయ వ్యవస్థలో టెక్నాలజీ ఆధారిత విప్లవాత్మక మార్పులు జరుగుతున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. నోవాటెల్ హెచ్ఐసీసీలో లెక్స్ విట్ నెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ది గ్రాండ్ మాస్టర్ 2025 – హైదరాబాద్ ఎడిషన్’ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ “ఒక న్యాయవాదిగా నా ప్రయాణం ప్రారంభ మైందని, రాజకీయాల్లోకి వచ్చినా న్యాయ వ్యవస్థ పట్ల నాలో ఉన్న ఆపత్యం అదే ఉందన్నారు. అప్పటికీ, ఇప్పటికీ న్యాయ వ్యవస్థ ఎన్నో మార్పులకు లోనైందని, టెక్నాలజీ వినియోగం విస్తరించి ఏఐ ఆధారిత న్యాయ పరిశోధన, వర్చువల్ కోర్టులు, రియల్ టైమ్ కేసు ట్రాకింగ్, ఈ-ఫైలింగ్ వంటి సాంకేతిక వ్యవస్థలు న్యాయ సేవలను వేగవంతం చేస్తున్నాయన్నారు. న్యాయవాదులు కేవలం కోర్టు అధికారులు మాత్రమే కాక, సమానత్వ శిల్పులు, రాజ్యాంగ హక్కుల సంరక్షకులుగా ఉండాలని, ఇప్పుడు వారు న్యాయ నిపుణులు మాత్రమే కాక, బిజినెస్ ఎనేబులర్లు, కాంప్లియెన్స్ నావిగేటర్లు, టెక్ ఇంటిగ్రేటెడ్ అడ్వైజర్లుగా మారుతున్నారన్నారు. నాస్కామ్ లీగల్ టెక్ రిపోర్ట్–2025 ప్రకారం 63 శాతం పెద్ద భారతీయ కంపెనీలు న్యాయ పరంగా ఏఐ, ఆటోమేషన్‌పై ఆధారపడుతున్నా యన్నారు. హైదరాబాద్‌లో 120కి పైగా స్టార్టప్‌లు ఈ-డిస్కవరీ, డిస్ప్యూట్ అనలిటిక్స్, వర్చువల్ ఐపీఆర్ వంటి రంగాల్లో అభివృద్ధి పనుల్లో నిమగ్నమై ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 5.15 కోట్లకు పైగా కేసులు పెండింగ్‌లో ఉండగా, ఇందులో 4.56 కోట్లు జిల్లాస్థాయి న్యాయస్థానాల్లోనే ఉన్నాయని, తెలంగాణలోనూ 10 లక్షలకు పైగా కేసులు ఇంకా పరిష్కారం కాకుండా మిగిలి ఉన్నాయని చెప్పారు. ఆలస్యమైన న్యాయం అంటే న్యాయం నిరాకరించ బడినట్టేనని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవాద వృత్తిని కేవలం జీవనోపాధిగా కాక, సమాజ పట్ల బాధ్యతగా చూడాలని, చట్ట జ్ఞానంతో పాటు సమస్యలు పరిష్కరించే సామర్థ్యం ఉండాలని, న్యాయవాదుల అసలైన క్లయింట్ ఒక్క వ్యక్తి కాదు, న్యాయవ్యవస్థ మొత్తమేనని గుర్తించాలని యువ న్యాయవాదు లకు సూచించారు. రాజ్యాంగ పీఠిక ప్రకారం సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందరికీ అందేలా కృషి చేయాలని, ఎల్లప్పుడూ న్యాయం పక్షాన నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లెక్స్ విట్ నెస్ ప్రతినిధులు అభిజిత్, శ్రీనివాస్, పలు సంస్థల లీగల్ హెడ్స్ పాల్గొన్నారు.